న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా.. కర్నాటక సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 1413 కోట్లుగా ఉంది. దేశంలో ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల్లో నలుగురు మాత్రమే బిలియనీర్లుగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రులు సగటు ఆస్తుల విలువ 118.07 కోట్లుగా ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక( Association for Democratic Reforms Report) ద్వారా వెల్లడైంది. కానీ అత్యంత సంపన్న సీఎం లిస్టులో డీకే శివకుమార్ టాప్‌లో ఉన్నారు. ఇక మిగితా ముగ్గురిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ సీఎం ప్రేమా ఖందు ఉన్నారు. చంద్రబాబు ఆస్తుల విలువ 931 కోట్లు కాగా, సీఎం విజయ్ వద్ద 648 కోట్లు, ప్రేమా ఖందు వద్ద 332 కోట్ల ఆస్తులు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ముఖ్యమంత్రులకు చెందిన ఫైనాన్షియల్, క్రిమినల్, ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ విశ్లేషణ ఆధారంగా సంపదను గుర్తించినట్లు ఏడీఆర్ తన రిపోర్టులో పేర్కొన్నది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ ఆస్తుల విలువ 7.81 కోట్లు. ఆయన పీజీ చదివారు. పెన్షనర్, ప్రైవేటు కాంట్రాక్టర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రావెల్ గైడ్‌గా తన ప్రొఫెషన్‌ను ఆయన రాసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్తుల విలువ 1.97 కోట్లు, ఆయన 12వ తరగాతి పాసయ్యాడు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు విలువ 5.31 కోట్లు. డ్రిగ్రీ చదివారు, ప్రొఫెషనల్ అడ్వకేట్ కూడా. హర్యానా సీఎం నయాబ్ సైనీ ఆస్తుల విలువ 5.80 కోట్లు, ఆయన డిగ్రీ చదివారు. స్టోన్ క్రషర్ ఓనర్ కూడా. ఎన్నికల వేళ సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా డేటాను సేకరించారు. 31 మంది ముఖ్యమంత్రుల్లో.. 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఆస్తులు తక్కువ ఉన్నవారిలో ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా(రూ.55 లక్షలు), బెంగాల్ సీఎం సువేందు అధికారి(85 లక్షలు), రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ (కోటి) ఉన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లా స్థిరాస్తులు వెల్లడించలేదు. క్రిమినల్ కేసులు అధిక సంఖ్యలో ఉన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. సీఎం రేవంత్‌పై 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌లో పేర్కొన్నారు. సువేందు అధికారిపై 29 కేసులు, శివకుమార్‌పై 19 కేసులు, చంద్రబాబు నాయుడిపై 19 కేసులు, సతీశన్‌పై 18 కేసులు, హేమంత్ సోరెన్‌పై 5 కేసులు, ఫడ్నవీస్‌పై 4 కేసులు, సుఖ్విందర్ సింగ్ సుఖూపై 4 కేసులు, జోసెఫ్ విజయ్‌పై రెండు కేసులు, సమ్రాట్ చౌదరీపై రెండు కేసులు, సిక్కిం పీఎస్ తమాంగ్‌పై ఓ కేసు, భగవంత్‌మాన్‌పై ఒకటి, మోహన్ చరన్ మాజీపై ఒకటి, భజన్ లాల్ శర్మపై ఓ కేసు ఉన్నాయి. ఆర్థిక పరంగా 31 మంది సీఎంలలో 15 సీఎంల ఆస్తుల విలువ 11 కోట్ల నుంచి 49 కోట్లుగా ఉంది. కానీ ఇద్దరు సీఎంల ఆస్తులు మాత్రం కోటి కన్నా తక్కువగా ఉన్నాయి. మొత్తం 31 మంది సీఎంల ఆస్తుల విలువ 3660 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు పేర్కొన్నది.