Karnataka : రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. పొగాకు, నికోటిన్ ఉన్న పాన్ మసాలా, గుట్కాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ‘ద ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (ఎఫ్డీఏడీ)’ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, రవాణా, పంపిణీ చేయడం కూడా నేరమే. ఎఫ్డీఏడీకి చెందిన అధికారులు తయారీదారులపై నిఘా పెడతారు.
తయారీ సంస్థల్లో తనిఖీలు, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఇకపై నిషేధం ఉన్నందున అధికారులు తనిఖీలు చేసి, నోటీసులు జారీ చేస్తారు. జరిమానా కూడా విధిస్తారు. ఈ నిషేధం ఆగష్టు 10, 2026 నుంచి ఏడాది పాటు అమలులో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2026 లోని సెక్షన్ 30(2)(ఏ)తోపాటు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్రొహిబిషన్ అండ్ రెస్ట్రిక్షన్స్ సేల్స్) రెగ్యులేషన్స్, 2011 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు సంబంధిత అధికారులకు తెలియజేయాలి. నిషేధం కాని ఉత్పత్తుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.
ప్రతి ఉత్పత్తిదారుడు ప్యాకేజింగ్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలు పాటించాయి. పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ సంబంధిత మెటీరియల్ వాడకూడదు. పేపర్, పేపర్ బోర్డ్, సెల్యులోజ్, ఇతర సహజ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. ప్లాస్టిక్, సింథటిక్ పాలిమర్, కో పాలిమర్స్, ల్యామినేట్స్ వాడకూడదు. అల్యూమినియం ఫాయిల్స్, మెటలైజ్డ్ లేయర్స్ కూడా వాడకూడదు. టిన్ అండ్ గ్లాస్ కంటైనర్స్ మాత్రం వాడొచ్చు.