కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28: బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఎవరు ఏం మాట్లాడుతారో వారికే తెలియని అయోమయంలో ఉన్నారని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు ఎద్దేవా చేశారు. ‘కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టామని ఈటల చెప్తున్నారు. బీజేపీ పోటీలో లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటిస్తున్నారు. ఏది నిజం?.. ఇంతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండినా?, ఈటలనా? ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లో సునీల్‌రావు మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులను నిలుపలేదని కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించాయని.. ఈటల ఇందుకు విరుద్ధంగా చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. హు జూరాబాద్ తరహాలోనే కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమన్నారు.