రాష్ట్రంలో పండించిన వడ్లు కేంద్రం కొనాల్సిందేనని, కొనేదాకా వదిలేది లేదని మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ సర్కారు వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. పంజాబ్ తరహాలో ఇక్కడి వడ్లు కూడా కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే కార్యక్రమాలపై గురువారం కరీంనగర్, అల్గునూర్, బూరుగుపల్లి, హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని, తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, రైతుల ఇండ్లపై నల్లజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ కార్పొరేషన్/ గంగాధర మార్చి 24 : రాష్ట్రంలోని పండించిన వడ్లు కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని, కొనేదాకా వదిలేది లేదని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు స్పష్టం చేశారు. రైతాంగానికి న్యాయం జరిగేందుకు మరో పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసనగా చేపట్టే కార్యక్రమాలపై నియోజవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాలు గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులకు చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ గ్రామ స్థా యి నుంచి పోరాటం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న అన్ని గ్రామ పంచాయతీలు, 27న మండల పరిషత్‌లు, 28న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 29న డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, 30న జిల్లా పరిషత్, సుడా, 31న అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేసి మోదీకి పంపాలని పిలుపునిచ్చారు. ఈ నెలాఖరు దాకా ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు, రాస్తారోకో, ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శన, రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరవేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ జూమ్ యాప్ ద్వారా ఢిల్లీ నుంచి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సమావేశం అల్గునూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రసమయి అధ్యక్షతన నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూపా గార్డెన్స్‌లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించగా, ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మెట్పల్లి పట్టణంలోని మనోహర్ గార్డెన్స్‌లో కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని దేవీశ్రీ గార్డెన్స్‌లో ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పరిధిలోని ఆర్ఆర్ గార్డెన్లో రామగుండం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్‌లో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మంథనిలో జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధూకర్ తన రాజగృహంలో సమావేశం నిర్వహించారు.సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహారాజా ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగగా పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, రాష్ట్ర మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి హాజరయ్యారు. జిల్లాకేంద్రంలో పద్మనాయక కల్యాణ మండపంలో సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి సన్నాహక సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.