చిగురుమామిడి, మార్చి 10 : కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం రామంచ గ్రామంలో అద్భుత చారిత్రక ఆనవాళ్లు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. క్రీస్తు పూర్వం మూడు వేల ఏండ్ల నుంచి కాకతీయుల కాలం వరకు సంబంధించిన నిర్మాణాలు, రాతి విగ్రహాలు, ప్రాచీన మానవులకు చెందిన బృహత్శిలా సమాధులు ఉన్నట్లు కరీంనగర్, హనుమకొండ జిల్లాల పురాతత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎన్ సాగర్, మల్లు నాయక్, టీం ఆఫ్ రీసెర్చ్, కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) కార్యదర్శి అరవింద్ ఆర్య బృందం తెలిపింది.
ఈ మేరకు రామంచలో గురువారం పర్యటించింది. ఇక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏక ఖండిత రాతి గుట్టపై 13వ శతాబ్దానికి చెందిన రెండు త్రికూటాలయాలు ఒకేచోట ఉండడం అరుదైన విషయమని అధికారులు పేర్కొన్నారు. పక్కపక్కనే శివాలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను నిశితంగా పరిశీలించారు. ఆలయాల్లోని శిల్పాలు, నంది విగ్రహాలు అరుదైనవిగా పేర్కొన్నారు.
ఇక్కడ శివలింగంతోపాటు రాజేశ్వరీదేవి అద్భుత శిల్పం, అరుదైన జటా భైరవుడి విగ్రహం, గ్రామ పొలిమేరలోని మోయతుమ్మెద వాగు ఒడ్డున వీరగల్లు విగ్రహం, ఆలయం ఉన్న గుట్టకు సుమారు 250 మీటర్ల దూరంలో చాముండీదేవి (పాత పోచమ్మ) విగ్రహం, సూర్యుడు, నాగదేవత విగ్రహాలను పరిశీలించి వాటి ఆకృతి ఆధారంగా అవి అతి పురాతనమైనవని తెలిపారు. గుట్ట దిగువ భాగంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో రెండు శాసనాలను గుర్తించామని, పెద్ద శాసనంపై విశ్వంలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం శివాలయంలో ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలు కొనగేలా ఉండాలని భూదానం, గోదానం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఇందుకు గుర్తుగా శాసనంపై గోవులు, సూర్య, చంద్రుల ఆకారాలను చెక్కారని వివరించారు.
దీనిపై హలెకన్నడ (తెలుగు కన్నడ) లిపి ఉందని, మరింత పరిశోధన చేస్తే ఊరిలోని అన్ని నిర్మాణాలు, శిల్పాల ప్రత్యేకతలను తెలుసుకోవచ్చని చెప్పారు. త్వరలోనే మరోసారి రామంచలో పర్యటించి శాసనంపై ఉన్న వివరాలను ప్రత్యేకంగా పొందుపరుస్తామని తెలిపారు. వారివెంట సర్పంచ్ గుంటి మాధవి-తిరుపతి, ఆలయ కమిటీ చైర్మన్ గర్దాస్ సతీశ్‌కుమార్, సెక్రెటరీ లోకిని ఆంజనేయులు, కమిటీ సభ్యులు నాయిని తిరుపతిరావు, కందుకూరి వెంకటేశ్వర్లు, దాసరి రవి, దర్శనం సంపత్, ఆంజనేయులు, వంటకాల రాజు, మహిపాల్‌రెడ్డి, సిద్దెంకి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.