నాటి ఉమ్మడి పాలనలో వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. పొట్ట కూటి కోసం పిల్లాపాపలతో వలసలు.. ఉన్న చోట ఉపాధి లేక అప్పుల బాధలు.. ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. రోడ్డున పడ్డ కుటుంబాలు.. అయినా చోద్యం చూసిన పాలకులు..
నేటి స్వరాష్ట్ర పాలనలో వస్త్ర పరిశ్రమకు పునర్జీవం.. నేతన్నకు అన్ని విధాలుగా సర్కారు ప్రోత్సాహం.. గాడిన పడిన బతుకు దెరువు.. వలసలు వాపస్.. చేతినిండా పని.. పనికి తగ్గ వేతనం.. జీవితాలకు భరోసా.. భార్యా పిల్లాపాపలతో కలిసి ఉన్న చోటనే సంతోషంగా జీవనం..
నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర సర్కారు, మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా చేనేత, మరమగ్గాల కార్మికులకు ‘రైతుబీమా’ మాదిరిగా ‘నేతన్న బీమా’ను నేడు లాంఛనంగా ప్రారంభించబోతున్నది. గతేడాది సిరిసిల్ల గడ్డ వేదికగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు.. జాతీయ చేనేత దినోత్సవ కానుకగా సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లో పథకానికి అంకురార్పణ చేయనున్నారు. దురదృష్టవశాత్త్తు ఎవరైనా చనిపోతేవారి కుటుంబానికి 5 లక్షల సాయం అందించి ఆదుకోనుండగా, నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్/ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. నాటి పాలనలో కుదేలైన వస్త్ర పరిశ్రమకు చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జీవం పోసింది. అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. యూనిఫాంలు, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పనికల్పించింది. ఉపాధి చూపడమే కాకుండా వేతనాలు పెరిగేలా చేసింది. ఇంకా పాత మరమగ్గాలను పూర్తి సబ్సిడీతో ఆధునీకరించుకునేలా యజమానులు, ఆసాములను ప్రోత్సహిస్తున్నది. నెలనెలా సంపాదించిన కూలీ పైసలు వృథాగా ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకునేలా త్రిప్టు పథకాన్ని పునః ప్రారంభించింది. ఈ పథకం కింద కార్మికుడు 8శాతం జమచేస్తే, మరో 8 శాతం కలిపి 16శాతం ఖాతాల్లో జమ చేస్తున్నది. కరోనా సమయంలో ఒక్కో చేనేత పారిశ్రామికుడు 50వేల నుంచి లక్ష వరకు వీటిని పొందారు. అంతే కాకుండా చేనేత మిత్ర పథకం కింద నూలు సబ్సిడీ ఇస్తున్నది. అంతే కాకుండా, 12 గంటల పాటు నిల్చుండి పనిచేసే కార్మికులకు 50 ఏండ్ల నుంచే నెలకు 2016 అందిస్తున్నది. చేనేత సహకార సంఘాలకు రుణ పరిమితి సౌకర్యం (క్యాష్ క్రెడిట్) కల్పించింది. అంతే కాకుండా పవర్ లూం సభ్యులకు 50 శాతం విద్యుత్తు సబ్సిడీని ఇస్తున్నది. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుతోపాటు అనుబంధ రంగమైన గార్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తున్నది. సిరిసిల్లలో అప్పారెల్ పార్కును ఏర్పాటు చేసి, 10వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. ఇప్పటికే రెండు బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టి, వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇంకా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇలా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం హాండ్లూం, పవర్ లూం పారిశ్రామిక కుటుంబాలను ఆదుకుంటున్నది.
చేనేత దినోత్సవ కానుకగా నేతన్న బీమా
నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర సర్కారు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. సిరిసిల్ల గడ్డ వేదికగా గతేడాది జూలై4న మంత్రి కేటీఆర్ చొరవతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ‘రైతు బీమా’ తరహాలో ‘నేతన్న బీమా’కు అంకురార్పణ చేయనున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో అమలు కానుండగా, ఇది నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతగా నేడు సిరిసిల్లలో పెద్ద సంఖ్యలో తమ కుటుంబాలతో కలిసి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
కేసీఆర్ సారూ అన్ని మంచిజేత్తుండు..
నాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరి పెండ్లిడ్లు చేసిన. కల్యాణలక్ష్మి కింద పెద్దబిడ్డకు రూ. 75వేలు. చిన్నబిడ్డకు లక్షా నుటాపదహారు రూపాయలు అచ్చినయ్. చేనేత సంఘంల మగ్గం కార్మికుడిగా పనిచేస్తున్న మా ఆయనకు నెలకు రెండువేల పింఛన్ అత్తుంది. కండేలు చుట్టే నాకు నెలనెలా జీతంలెక్క పైసలు వస్తున్నయ్. ఇప్పుడు ప్రభుత్వం బీమా పథకం తెస్తుందని తెలిసి సంతోషమనిపిస్తున్నది. నాలాంటి ఎందరో కుటుంబాలకు భరోసా దొరుకుతది. కేసీఆర్ సారు అందరికీ మంచిజేత్తున్నడు.
– బైరి అరుణ, (హుజూరాబాద్)
కుటుంబాలకు ధీమా
రైతుల మాదిరిగా నేతన్న కోసం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 5 లక్షల బీమా సౌకర్యం కలుగనున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న కార్మికులందరూ ఈ పథకానికి అర్హులు కాగా, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నది. ఒక్కొక్కరికి 2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది కార్మికులకు బీమా వర్తించనున్నది. అందులో సిరిసిల్లలోనే 10 వేల మంది ఉండగా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 5 వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 6 వేల మంది, కరీంనగర్ జిల్లా పరిధిలో 1964 మంది కార్మికులు బీమాకు అర్హులుగా గుర్తించారు. వీరు త్రిప్టు పథకంలో చేరడంతో గుర్తించడం సులువు కాగా, ఇంకా ఈ పథకంలో చేరని వారందరినీ చేర్పించి, బీమా పథకం వర్తించేలా ఉమ్మడి జౌళీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీమా కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 వేల మందికి సంబంధించి ఏటా 3.40 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నది.
మాకు భరోసా లభించింది..
గతంలో మేం మా వృత్తి చేసుకుంట అనేక అవస్థలు పడ్డం. కలోగంజో తాగి బతికినం. మేం నేచే బట్టలు, మేం వేసే బట్టలు మాత్రమే తెల్లగా ఉండేవి. మావి, మా కుటుంబ సభ్యుల కడుపులు మాడుతుండేవి. మమ్ముల ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. ఎన్నో ఏండ్లు మీటర్‌కు రూ.11 మాత్రమే ఉండేది. కానీ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీటర్‌కు రూ.30లు అయ్యింది. పదిహేనేండ్ల నుంచి ఈ పనిచేస్తున్న. సీఎం సార్ రాకపోతే ఈ పని మానేసేటోన్ని. ఇప్పుడు చేనేత బీమాతో మాకు ఓ భరోసా దొరికింది. ఉన్నా పోయినా కుటుంబానికి ఓ ఆధారమైతదని ఆనందంగా ఉన్నది.
గిసొంటి స్కీం ఉంటే బాగుండు..
నేను నా భర్త హుజూరాబాద్ సహకార సంఘంల పనిచేసేదానిని. నేను దారపు కండేలు చుట్టేది. నా భర్త రాజేశం మగ్గంపై బట్టలు నేసేటోడు. మాకు ముగ్గురు పిల్లలు. ఆయన 18 ఏండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయిండు. అప్పుడు మా పిల్లలు బడికిపోతున్నరు. ఆయన కాలంజేయడంతో అందరం ఆగమైనం. ఏదన్న సాయం జేత్తరని ఆఫీసుల సుట్టూ తిరిగినం. కానీ ఎవరూ పట్టించుకోలే. నయా పైసా రాలే. ఇప్పుడు కేసీఆర్ సారు బీమా పథకం తెత్తుండని తెలిసింది. ఏవరైనా చనిపోతే ఐదు లక్షలు వస్తయట. గిసొంటి స్కీం అప్పట్ల ఉంటే బాగుండేది.
కంటికి రెప్పలా చూసుకుంటున్నరు
తెలంగాణ వచ్చినంక మా సాంచాలకు మంచి రోజులచ్చినయ్. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు మంత్రి కావడం మాకు అదృష్టం కలిసొచ్చింది. కామ్గార్ల గురించి ఆయన చాలా చేసిండు. పాత సాంచాలపై బట్ట మంచిగ రాదని చెప్పి, కొత్త సాంచాలు పెట్టుకోమని సూరత్, ముంబై, తమిళనాడు నుంచి వెరైటీ సాంచాలను తెప్పించి ఎగ్జిబిషన్ పెట్టించిండు. బతుకమ్మ, క్రిస్మస్ బట్టలతో సర్కారు బతుకుదెరువు చూపింది. రాత్‌పైలీ, దిన్పైలీ చేసి తాకత్ తక్కువవుతున్న మాకు 50 ఏళ్లకే పింఛను ఇస్త్తున్నది. పది శాతం యారన్ సబ్సిడీ మాకే వచ్చేలా జేసింది. కూలీ పైసలన్నీ ఖర్చు పెట్టకుండా త్రిప్టుతో పొదుపు చేసుకున్నం. దాసుకున్న పైసలు కరోనా కష్టకాలంల ఆదుకున్నయ్. కార్మికులందరికీ సర్కారే బీమా చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ సార్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నరు. ఆయనకు రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటున్నం.
– అరికాల గణేశ్, మరమగ్గాల కార్మికుడు (సిరిసిల్ల)
చేసుకునేంత పని ఉన్నది..
గతంల సాంచాలు ఎన్నడూ సక్కగా నడవలేదు. కేటీఆర్ సారు కార్ఖాన్లకొచ్చి సాంచాలను చూసినప్పుడు మాగోస చెప్పుకుని ఏడ్చినం. తెలంగాణ వస్తే మీ కష్టాలు తీరుస్తనన్నడు. అందరూ గిట్లనే జెప్పిన్రు.. ఈ సారు కూడా ఏం జేత్తడనుకున్నం. మంత్రి అయినంక ఎంటనే సాంచాలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిండు. బతుకు దెరువుకు భీవండి మొకాన పోతామనుకున్న మాకు చేతి నిండా పనిచ్చిండు. ఇగ కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటమని ఫిక్సయినం. ఇప్పుడు చేసుకునేంత పని ఉన్నది. రాత్ పైలీ, దివస్ పైలీలో కొంచెం గూడ కరెంటు పోతలేదు. యారన్ సబ్సిడీతో కూలీ ఎక్కువస్తంది. మాకు జీవిత బీమా పైసలు సర్కారే కడుతుందని సేట్లు చెప్తే సంబురమనిపించింది. అయిదేళ్లు నోట్లోకి పోతున్నయంటే కేటీఆర్ సార్ దయవల్లనే.
– డీ శ్రీనివాస్, మరమగ్గాల కార్మికుడు (సిరిసిల్ల)
జాబితా తయారు చేస్తున్నాం
నేతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నది. నేతన్నకు బీమా సౌకర్యం కల్పించడం హర్షణీయం. కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికుల జాబితా రూపొందిస్తున్నాం. త్రిఫ్టు పథకంలో చేరిన వారితో పాటు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– గుండ సంపత్‌కుమార్,
కరీంనగర్ జిల్లా చేనేత జౌళీశాఖ అధికారి