కార్పొరేషన్, జూలై 27:‘ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏం చేసినవ్? ఒక్క రోజైనా స్థానికంగా ఉన్నావా..? ప్రజలపై పట్టింపులేదు. ప్రగతిపై సోయి లేదు. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి. నేటిలోగా స్పందించకపోతే నువ్వు తప్పు చేసినట్లుగానే భావిస్తాం’ అని ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కరీంనగర్‌లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజేందర్ బీజేపీలోకి వెళ్లిన తర్వాత గొప్పలకు పోతున్నాడని, గజ్వేల్‌లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నాడని, ‘గజ్వేల్ ఎందుకు? మరోసారి హుజూరాబాద్‌లో పోటీ చేసి గెలువ్’ అంటూ ఫైరయ్యారు. హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికల్లో గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా పారిపోతున్నది ఈటల కాదా..? అని ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా స్థానికంగా ఉండడం లేదని, అభివృద్ధిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడి పారిపోతున్నాడని దుయ్యబట్టారు. మరోసారి హుజూరాబాద్‌లో పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతోనే గజ్వేల్‌లో పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేరు, పత్రం లేని ఆయన్ను లీడర్ చేసిన కేసీఆర్‌నే మోసం చేశాడని ఆరోపించారు.
నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తూ తప్పుడు మాటలు చెప్పుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్లో కేసీఆర్
బానిసలు అని వ్యాఖ్యలు చేస్తున్న ఈటల.. 2004 నుంచి 2021 వరకు టీఆర్ఎస్లో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరి ఆ సమయంలో ఏ బానిసత్వం చేస్తే ఈటలకు కేసీఆర్ అన్ని పదవులు ఇచ్చాడో చెప్పాలని, మాట్లాడడానికి సిగ్గు, మానం, శరం ఉండాలని మండిపడ్డారు. దళితబంధు పథకంపై వాస్తవాలు తెలుసుకొని విమర్శలు చేయాలన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేశామని, 15 వేల యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. ఈటల సొంత ఊరు కమలాపూర్‌లోని ఎస్సీ కాలనీకి పోతే ఈ విషయం తెలుస్తుందన్నారు. దళితులంటేనే ఈటలకు చిన్నచూపు అని విమర్శించా రు. దళిత ఎమ్మెల్యేలు రవిశంకర్, బాల్కసుమన్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు.
దళితుల భూములను కబ్జా చేసుకున్న చరిత్ర రాజేందర్‌ది అని దుయ్యబట్టారు. బడుగుల భూములను కబ్జా చేశాడనే కారణంతో టీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని గుర్తు చేశారు. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీ లో చేరారని విమర్శించారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి లక్ష రూ పాయలైనా కేంద్రాన్ని అడిగి తెచ్చావా అని ప్రశ్నించారు. బీసీల ముసుగులో ఉన్న దొర ఈటల అని విమర్శించారు. ఐదెకరాల స్థలంలో గడి కట్టుకొని పాలిస్తున్నది ఈటలనేనని పేర్కొన్నారు. 2004 ముందు ఆస్తులు ఎన్నో ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే నియోజకవర్గంలో అభివృద్ధి విషయంపై చర్చకు రావాలని, కేసీఆర్ ఏం చేశారో చెబుతామని పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.