కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు సాగునీరు అందక, సరిపడా కరెంట్ రాక రైతులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మరో వారం పది రోజుల్లో ఆయకట్టుకు నీళ్లివ్వకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదమున్నది. ఇక కరీంనగర ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల్లో ఒక్కటైన డంప్‌యార్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వెదజల్లే విషపూరితమైన పొగతో రోగాల బారిన పడుతున్నారు. ఇక గంగాధర మండలం నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని 53 రోజులుగా ఆ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీనే నెరవేర్చాలని వారు కోరుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు దళితబంధు కింద తమ ఖాతాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జమచేసిన నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని వేలాది మంది దళితులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలా కరీంనగర్ జిల్లాలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలూ నెరవేరడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో చొప్పదండి మండలం గుమ్లాపూర్ బహిరంగ సభలో జిల్లాకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పట్టాలెక్కలేదని గుర్తుచేస్తున్నారు. బుధవారం కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు వస్తున్న సీఎం. ఇప్పుడైనా జిల్లా సమస్యలను పట్టించుకుంటారా? అని ఎదురుచూస్తున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీళ్లు, 24గంటల కరెంట్‌తో రంది లేకుండా వ్యవసాయం చేసిన రైతన్న.. మళ్లీ అరిగోస పడుతున్నాడు. ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో సాగునీటి కష్టాలు, పది పన్నేండ్లలో ఎన్నడూ లేని కరెంట్ కోతలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో వానకాలం పంటలు చేతికి వస్తాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వారం పది రోజుల్లో నీటిని ఎత్తిపోయకుంటే ఆయకట్టు ప్రాంతంలోనే పంటలు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.
గంగాధర మండలం నారాయణపూర్‌లోని పెద్ద చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద రిజర్వాయర్‌గా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ఈ చెరువు పనులను కేసీఆర్ హయాంలో పూర్తిచేసి నీటిని విడుదల చేశారు. ఇప్పుడు ఈ చెరువు కట్టను బలోపేతం చేయడంతోపాటు 2 మీటర్ల ఎత్తు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. కట్టకు 20 మీటర్ల దూరంలో ఉన్న ఇండ్లను మాత్రమే ముంపుగా పరిగణిస్తామని స్పష్టంచేసింది. ఈ పరిధిలో ఉన్న 38 నివాస గృహాలను తరలించేందుకు సర్వే చేసింది. కానీ మిగతా 368 గృహాలను కూడా సర్వే చేసి గ్రామం మొత్తాన్ని ముంపుగా పరిగణించాలని గ్రామస్తులు 53 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు.
కరీంనగర్లో డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 5న చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ హామీ ఇచ్చిన విషయాన్ని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. నేషనల్ హైవే పక్కన ఉన్న సిర్సపల్లిలో డంపింగ్ యార్డుకు హైవే అథారిటీ అంగీకరించడం లేదని తెలుస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి గుమ్లాపూర్ సభలో రెండు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేసిన ఇప్పటివరకు కార్యాచరణకు నోచుకోలేదు. ఇందులో మొదటిదైన రామడుగు మండలంలో రూ.45.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఒకటి. దీనితో యువతకు స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చే అవకాశం ఏర్పడేది. ఈ మండలంలోని వెదిరలో భూమి కేటాయించాలని ప్రతిపాదనలు జరిగాయి. కానీ ఇంతవరకు పునాది రాయి కూడా పడలేదు. గంగాధర మండలం మధురానగర్‌లో రూ.5 కోట్లతో డిగ్రీ కళాశాల పనులకూ అదే రోజు సీఎం శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. స్థల పరిశీలనతోనే సరిపెట్టారు. ఈ రెండు పనులకు మోక్షమెప్పుడోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇక దళితబంధు పథకంపైనా ప్రభుత్వం నిర్లక్ష్యం అదే తీరుగా ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో దళితుల సంక్షేమం కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్‌గా అమలుచేసిన ఈ పథకం కింద వేలాది మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపాయి. మొత్తం 18,021 దళిత కుటుంబాలకు ఈ పథకం అండగా నిలిచింది. ఈ పథకం కింద రూ.9.90 లక్షల చొప్పున పూర్తి రాయితీ కింద ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 9,873 మందికి పంపిణీ చేశారు. రెండో విడుత కింద మరో 8,148 కుటుంబాలకు రూ.274.60 కోట్లు రావాల్సి ఉన్నది. ఇందులో 2,400 మందికి ఆర్థిక సహాయం అందించే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు ఖాతాలపై ఆంక్షలు విధించింది. అప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమై ఉన్న నిధులను విడిపించుకోకుండా ఫ్రీజ్ చేసింది.