హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కందిక ఆదర్శ్ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా న్యాయ సలహాలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఆదర్శ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంగళవారం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి టీహబ్ సహకారంతో అండగా నిలిచారని తెలిపారు. సీఎల్ఎన్ఎస్ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నారని కొనియాడారు.
‘సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్ మాకెప్పుడూ చెప్తుంటారు.. తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీహబ్, వీహబ్, టీవర్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది’ అని గుర్తుచేశారు.