బీర్కూర్/కామారెడ్డి టౌన్, నవంబర్ 16: ప్రభుత్వ నిర్ణయాలను పకడ్బందీగా అమలుచేస్తూ.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మండల అధికారులకు సూచించారు. బీర్కూర్ తహసీల్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల రెవెన్యూ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాను పరిశీలించి, రైతులకు సంబంధించిన భూమి అయితే రైతులకు, ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమిగా రికార్డు చేయాలని సూచించారు. అనంతరం ఆయన అక్కడి నుంచే తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాలన్నారు. గ్రామాల్లో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పంట మార్పిడితో కలిగే లాభాలను అన్నదాతలను వివరించాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీఎం జితేంద్ర ప్రసాద్, ఇన్చార్జి డీఎస్వో రాజశేఖర్, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు ఎం.రాజు, ధన్వాల్, గిర్దావర్లు శ్రీనివాస్, పండరి, సర్వేయర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
17, 18వ తేదీల్లో గ్రామసభలు నిర్వహించాలి..
కామారెడ్డి టౌన్, నవంబర్ 16: పోడు వ్యవసాయంపై ఈనెల 17, 18వ తేదీల్లో గ్రామ సభలను నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మండల స్థాయి అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం నుంచి ఆయన మండలస్థాయి అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయంపై గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించాలన్నారు. గాంధారి మండలంలో 475 మంది అటవీ భూములను ఆక్రమించినట్లు గుర్తించామని చెప్పారు. వారిలో ఇప్పటివరకు 135 మంది, నిజాంసాగర్ మండలంలో 2,163 మందికి గాను 40 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. లింగంపేట్‌లో 442 మంది ఉం డగా ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలకు అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని తెలిపారు.