‘కల్కి-2’ నుంచి అగ్ర కథానాయిక దీపికా పడుకోన్‌ను (Deepika Padukone) తప్పించడం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సమకాలీన భారతీయ తారల్లో దీపికా పడుకోన్ కూడా ఒకరు. బాలీవుడ్లో రాణిస్తూనే హాలీవుడ్లో కూడా కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందీ భామ. దీంతో ‘కల్కి-2’ నుంచి ఆమె ‘తీసివేత’ వార్త సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతకుముందే ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ నుంచి దీపికాను తొలగించారు. ఈ వివాదం నడుస్తుండగానే ‘కల్కి-2’లో దీపికా పడుకోన్ నటించడం లేదని మేకర్స్ ప్రకటించడంతో సినీ ప్రియులు షాక్‌కి గురయ్యారు. ఈ నేపథ్యంలో రెండు ప్రతిష్టాత్మక తెలుగు పాన్ ఇండియా చిత్రాల నుంచి దీపికా నిష్క్రమణం వెనక కారణలేంటోనని చర్చ మొదలైంది.
‘కల్కి’ తొలిభాగం షూటింగ్‌లోనే సీక్వెల్‌కు సంబంధించిన 30 శాతం చిత్రీకరణను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో దీపికా పడుకోన్‌పై తీసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటికోసం ఆమె 20రోజుల పాటు పనిచేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం పలు సందర్భాల్లో వెల్లడించింది. అయితే ‘కల్కి-2’షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో దీపికా పడుకోన్ తన రెమ్యునరేషన్‌ను 25 శాతం పెంచాలనే డిమాండ్‌ను ముందుంచింది. పారితోషికం విషయంలో అప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయి ఉండటంతో దీపికా డిమాండ్‌ను చిత్రబృందం తోసిపుచ్చింది. అయితే సీక్వెల్ విషయంలో దీపికా ఆలోచనలు వేరుగా ఉన్నాయన్నది ఆమె సన్నిహితుల మాట. తొలిభాగంలో దీపికా పడుకోన్ పోషించిన సుమతి పాత్రకు మంచి పేరొచ్చింది. అనుక్షణం వేదనాపూరితంగా కనిపించే తల్లిగా ఆమె నటన సర్వత్రా ప్రశంసలందుకొంది. దీంతో ఈ పాత్రకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే భావనతో రెమ్యునరేషన్ పెంపుపై దీపికా పట్టుపట్టిందట. దీంతో ఆగ్రహానికి గురైన మేకర్స్ ఆమెను సినిమా నుంచి తప్పించారన్నది ఇన్సైడ్ టాక్. వీటితో పాటు తాను ఏడుగంటలు మాత్రమే పనిచేస్తానని దీపికా పెట్టిన డిమాండ్ పట్ల మేకర్స్ అసహనం వ్యక్తం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.