హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కడియం శ్రీహరి తన కూతురిని వెంటబెట్టుకుని ఢిల్లీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చకర్లు కొట్టేది ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, కేవలం తన మంత్రి పదవి కోసమేనని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంత్రి పదవి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారారని, 25 మంది ఎమ్మెల్యేలు తన వెంట వస్తే మంత్రి పదవి ఇస్తామన్న ఆశతో కాంగ్రెస్‌లోకి వెళ్తే, తీరా పది మంది కూడా వెళ్లకపోవడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. తాను దళితుడనని చెప్పుకొనే కడియం శ్రీహరి, ఘనపూర్ లేదా పర్వతగిరిలో దళితుల కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
కులాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రాజకీయ పదవులు అనుభవించినా, ఏ ఒక దళితుడిని ఎదిగేలా చేయలేదని మండిపడ్డారు. కడియం సాధించింది ఏమైనా ఉందంటే అది ఒక ‘దళిత దొర’ బిరుదు మాత్రమేనని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై మాటిమాటికీ విమర్శలు చేయడం మానుకోవాలని, సిగ్గు, శరం ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి రావాలని సవాల్ విసిరారు.
తాను జనగామ జిల్లా ఏర్పాటు, ఘనపూర్ రెవెన్యూ డివిజన్, హెల్త్ యూనివర్సిటీ, ఫె్లైఓవర్ బ్రిడ్జి, పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు, చెరువుల మరమ్మతులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణాలు కేసీఆర్ ఆశీస్సులతోనే సాధ్యమయ్యాయని వివరించారు. కడియం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అంబేదర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.