ముంబై : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 27 వరకు పొడగించింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. అనిల్ దేశ్‌ముఖ్‌పై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూవీ కనిపించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
ముంబై మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని ముంబై పోలీస్ అధికారులను డిమాండ్ చేశారని పరంబీర్ సింగ్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, అరెస్ట చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.