జూబ్లీహిల్స్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ.5వేల కోట్లు ఖర్చు చేశాం. 2లక్షల మందికి వివిధ పథకాల ద్వారా 2లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూర్చాం. కాంగ్రెస్ వచ్చిన ఈ రెండేళ్లలో మీరేం చేశారో చెప్పి ఓట్లు అడగాలి.
పేదల సొంతింటి కల నెరవేర్చి, ప్రజారోగ్యానికి పెద్దపీట వేశాం. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సహా అనేక అభివృద్ధి పనులకు 5328 కోట్లు ఖర్చు చేశాం.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూ.5,328 కోట్లు వెచ్చించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా 2,12,862 మంది లబ్ధిపొందారని తెలిపారు. ప్రజా రవాణా, రోడ్ల కోసం అంటే.. మెట్రో, రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల కోసం రూ.2,463 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రెండేండ్లలో జూబ్లీహిల్స్ కోసం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో చెప్పి ఓట్లు అడగాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ కోసం చేసిన అభివృద్ధిపై ‘ప్రగతి నివేదిక’ను తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విడుదల చేశారు. ఏయే రంగాల్లో ఎంతెంత ఖర్చు చేసింది గణాంకాలతో వివరించడమే గాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 2014 నుంచి 2023 వరకు ఎంత అభివృద్ధి చేశారో పథకాలవారీగా వెల్లడించారు.
– హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ)

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజారోగ్యం కింద టిమ్స్ దవాఖాన, బస్తీ దవాఖానలకు కోసం రూ.919 కోట్లు ఖర్చు చేసినట్టు కేటీఆర్ చెప్పారు. 2021 కరోనా కాలంలో కొవిడ్ వ్యాక్సిన్ కోసం రూ.13.87 కోట్లు ఖర్చు చేసి సుమారు 34,712 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద రూ.98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద రూ.73 లక్షలు, కంటివెలుగు కోసం రూ.55 లక్షలు, న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశామని వివరించారు.
జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.87 కోట్లు ఖర్చు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.51 కోట్లు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కోసం రూ.36 కోట్లు, శ్రీనగర్‌కాలనీ, రహ్మత్‌నగర్‌లో రెండు అంగన్వాడీ కేంద్రాలకు కోసం రూ.49 లక్షలు వెచ్చించినట్టు తెలిపారు. అభివృద్ధి, మౌలిక వసతులకు రూ.44 కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెప్పారు. మల్టీపర్సస్ ఫంక్షన్ హాల్స్ అభివృద్ధికి రూ.17.3 కోట్లు, సీసీ కెమెరాలకు రూ.2.7 కోట్లు, ఎల్ఈడీ లైట్స్ నిర్వహణ కోసం రూ.5 కోట్లు, షేక్‌పేట్ గుట్టపోచమ్మ ఆలయాల నిర్మాణం కోసం రూ.80 లక్షలు, శ్మశానవాటికల కోసం రూ.2.5కోట్లు, ఇతర నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని జనరేటర్లు లేకుండా కాంతిమయం చేసిందే బీఆర్ఎస్ సర్కారు అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇందుకుగాను విద్యుత్ నిర్వహణ కోసం రూ.505 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. రూ.455 కోట్లతో 10 సబ్స్టేషన్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.50 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.180 కోట్లు, ఉచిత నల్లా కనెక్షన్లకు రూ.30 కోట్లు వెచ్చినట్టు వెల్లడించారు. బోరబండ వాటర్ రిజర్వాయర్ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.
జూబ్లీహిల్స్‌లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని కేటీఆర్ వెల్లడించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ) పనుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పర్యావరణం, పచ్చదనం కోసం రూ.26 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. అందులో పారుల సుందరీకరణ కోసం రూ.20 కోట్లు, గులకపూర్ కాలువ, ఎర్రకుంట చెరువు అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు, విపత్తు నిర్వహణ పనులకు రూ.4.45 కోట్లు వెచ్చించినట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఏ గల్లీకి వెళ్లినా మాగంటి గోపినాథ్ వేసిన శిలాఫలకమే కనిపిస్తుందని తేల్చిచెప్పారు. తాము చేసిన అభివృద్ధి అంతా వివరించి ప్రజలను ఓట్లు అడుగుతున్నామని, దమ్ముంటే.. ఈ రెండేండ్ల్లలో కాంగ్రెస్ ఏం చేసిందో వివరించి ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్‌గౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసేందుకుగానూ గృహ నిర్మాణం కోసం రూ.324 కోట్లు ఖర్చు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. సామాజిక ప్రజా సంక్షేమం కోసం రూ.705 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మికి రూ.63 కోట్లు వెచ్చించి 6,320 మందికి లబ్ధి చేకూర్చినట్టు తెలిపారు. ఆసరా పింఛన్లకు రూ.564 కోట్లు పెట్టగా.. 25,905 మంది లబ్ధిపొందారని స్పష్టంచేశారు. బతుకమ్మ చీరలకు రూ.45.25 కోట్లు, దళితబంధుకు రూ.10.6 కోట్లు, బీసీ బంధుకు రూ.3.8 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్‌ల కోసం రూ.14 కోట్లు, అన్నపూర్ణ క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.2 కోట్లు వెచ్చించినట్టు వివరించారు.
1.ప్రజారోగ్యం, టిమ్స్ హాస్పిటళ్లు, బస్తీ దవాఖానలు : రూ.919 కోట్లు
2.ప్రజా సంక్షేమ కార్యక్రమాలు : రూ.705 కోట్లు
3. విద్యుత్తు నిర్వహణ:రూ.505 కోట్లు
4. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు: రూ.324 కోట్లు
5. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు: రూ.87 కోట్లు
6. ప్రజా రవాణా రోడ్లు, మెట్రో రైలు : రూ.2,463 కోట్లు
7. తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు : రూ.180 కోట్లు
8. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన : రూ.44 కోట్లు
9. శానిటేషన్, నాలా పనులు : రూ.75 కోట్లు
10. పర్యావరణం, పచ్చదనం : రూ.26 కోట్లు