
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, ఫొటో జర్నలిస్టు గుడిమల్ల భరత్ భూషణ్ (66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నల్లకుంట పద్మకాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ముఖ్యంగా బతుకమ్మ, గ్రామీణ జీవితాన్ని తన ఫొటోగ్రఫీతో ప్రపంచానికి చాటిచెప్పారు. కళాకారుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు.
భరత్ భూషణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక జీవితాన్ని అపురూపంగా చిత్రీకరించిన భూషణ్ మరణం తెలంగాణకు తీరని లోటని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. భరత్ భూషణ్ మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు కడసారి చూపు కోసం పద్మకాలనీలోని ఆయన నివాసానికి తరలివచ్చారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, గోరెటి వెంకన్న, ఎమ్మెల్యే కాంతి కిరణ్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తదితరులు భూషణ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంబర్‌పేట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య సుభద్ర, కూతురు అనుప్రియ, కుమారుడు అభినవ్ ఉన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిన భరత్‌భూషణ్
భరత్‌భూషణ్ 1954లో వరంగల్‌లోని ఓల్డ్ బీట్‌బజార్‌లో గుడిమళ్ల అనసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. ఫొటోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన భరత్ భూషణ్.. అనేక ఆంగ్ల, తెలుగు వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఎలుగెత్తి చాటుతూ వేల ఛాయా చిత్రాలను రూపొందించారు. తెలంగాణ ఉద్యమ చైతన్యం లేని రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష, బతుకమ్మ, చరిత్ర, గ్రామీణుల బతుకు చిత్రాలను తన కెమెరా కన్నుల్లో బంధించి ప్రపంచానికి చాటారు. కాళోజీ, చాకలి ఐలమ్మ, తెలంగాణ పల్లెల్లోని ఇండ్ల గడపలు, బతుకమ్మ ఆట, చారిత్రక ఘట్టాలను గొప్ప ఛాయా చిత్రాలుగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
తెలంగాణ అరుదైన చిత్రకారుడిని కోల్పోయింది: సీఎం కేసీఆర్
భరత్ భూషణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవనశైలి, సంస్కృతి, చారిత్రక సంఘటనలను తన ఆర్ట్, ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్‌భూషణ్ కృషి గొప్పదని కొనియాడారు. ఆయన మృతితో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫొటో జర్నలిస్టును కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.