TUWJ | గత ప్రభుత్వం జర్నలిస్టులకు పురస్కారాలు అందించిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరించిందని, వాటిని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఆ ప్రకటనలో జర్నలిస్టుల పాత్ర గురించి వెల్లడించిన అంశాలు.. చరిత్రాత్మకమైన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర క్రియాశీలకం.
తెలంగాణ ఉద్యమం (Telangana Movement)లో జర్నలిస్టులు కేవలం వార్తలను సేకరించి, ప్రచారం చేసే బాధ్యతకే పరిమితం కాలేదు. ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజేయడం, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, వాస్తవాలను ప్రజలకు చేరవేసి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షను, సామాజిక-ఆర్థిక అసమానతలను, ప్రాంతీయ అన్యాయాలను చర్చకు తీసుకువచ్చారు. అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదేవిధంగా పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు కూడా నాయకత్వం వహించారు.
ఉద్యమ సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు జరిపిన సంఘటనలు ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయి. ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు చోట్ల పోలీసులు కెమెరాలను ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడట, గాయపర్చడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ విధినిర్వహణలో జర్నలిస్టులు వెనుకడుగు వేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నిర్వర్తించారు.
అంతేకాకుండా, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారు. కొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. మరికొందరు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జర్నలిస్టుల పాత్రను గత ప్రభుత్వం గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలు (Awards) అందించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియ కొనసాగించేందుకు కమిటీ సిఫారసు చేయాలని కోరుతున్నాం.
ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించే విధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, వారి సేవలకు తగిన గౌరవం, గుర్తింపు, ప్రభుత్వం కల్పించే అన్ని అర్హతలను అందించాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల సేవలు, త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా కమిటీ (Committee) న్యాయమైన నిర్ణయం తీసుకోవాలి.