వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా సోకింది. ఆయనకు గురువారం కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. 79 ఏళ్ల బైడెన్‌కు తేలిక పాటి కరోనా లక్షణాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన వైట్‌హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నారని, అయినప్పటికీ పూర్తిగా విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ‘బైడెన్ పూర్తిగా టీకాలు తీసుకున్నారు. ఆయనకు తేలికపాటి లక్షణాలున్నాయి’ అని వైట్‌హౌస్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. కరోనా సోకిన ఆయన ఫైజర్ సంస్థ యాంటీ కోవిడ్ మాత్ర పాక్స్లోవిడ్ తీసుకుంటున్నారని పేర్కొంది.
కాగా, తాను క్యాన్సర్ బారిన పడినట్లు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే దీనిపై వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ముందు ఆయన చేయించుకున్న స్కిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ప్రస్తావించారని తెలిపింది. మసాచుసెట్స్‌లోని కోల్ మైన్ ప్లాంట్‌ను బైడెన్ సందర్శించారని, ఈ సందర్భంగా తన బాల్యంలో తమ ఇంటి వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే వాయువులు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయనేది వెల్లడిస్తూ ఆయన ఈ ప్రస్తావన చేశారని పేర్కొంది.