న్యూయార్క్, డిసెంబర్ 16: హార్వర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారత్‌కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టులు, మీడియా ప్రముఖులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. కాన్ఫరెన్స్‌కు హాజరవ్వాలని నకిలీ మెయిల్స్, ట్విట్టర్ ఖాతాల ద్వారా సందేశాలు పంపి.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే కుట్రకు పాల్పడ్డారు. ఎన్డీటీవీ మాజీ యాంకర్ నిధీ రజ్ధాన్ కూడా హ్యాకర్లు టార్గెట్ చేసిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. అయితే, హార్వర్డ్ ప్రతినిధులను జర్నలిస్టులు సంప్రదించడంతో హ్యాకర్ల గుట్టు రట్టయింది. 2019లో జరిగిన ఈ ఉదంతాన్ని అమెరికా వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ గురువారం వెలుగులోకి తీసుకొచ్చింది. యూఏఈ వేదికగా ఈ సైబర్ దాడులు జరిగినట్టు అనుమానిస్తున్నారు. అయితే, దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం తీసుకొన్న చర్యలు తెలియాల్సి ఉన్నది.