ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తూ, ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక నిత్యం సతమతమవుతూ బతుకుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రం నుంచి అరిగోసపడుతూ కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కొలువులను క్రమబద్ధ్దీకరిస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం వారిలో కొత్త వెలుగులను నింపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 431 మంది జూనియర్ కళాశాలల అధ్యాపకులు, 81 మంది పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, 83 మంది డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు. వీరందరి ఉద్యోగాలు రెగ్యులరైజ్ కానున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవింతాంతం రుణపడి ఉంటామని కాంట్రాక్టు అధ్యాపకులు పేర్కొంటున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 16: సమైక్య రాష్ట్రం నుంచి ఏండ్లుగా చాలీచాలని వేతనాలు, వెట్టిచాకిరితో పనిచేస్తూ అరిగోసపడ్డ కాంట్రాక్టు అధ్యాపకులకు మంచిరోజులు వస్తున్నాయి. వారి ఉద్యోగాల క్రమబద్ధ్దీకరణ కల నెరవేరనుంది. కాంట్రాక్టు అధ్యాపకులకు రెగ్యులర్ చేస్తామని ఇటీవల శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారంతా ఆనందంలో మునిగి తేలారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 431 మంది జూనియర్ కళాశాలల అధ్యాపకులు, 81 మంది పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, 83 మంది డిగ్రీ కళాశాలల అధ్యాపకుల ఉద్యోగాలు రెగ్యులరైజ్ కానున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు జీవింతాంతం రుణపడి ఉంటామని కాంట్రా క్టు అధ్యాపకులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ అధ్యాపకులతో సమానంగా కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. 2001-02లో రూ.7,500 వేతనం ప్రారంభం కాగా, 2011జూన్ నుంచి రూ.18 వేలుగా నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జనవరి 2017 నుంచి రూ.27 వేలకు పెంచింది. జూన్ 2017 నుంచి రూ.37,100 వేతనం చెల్లిస్తుండగా, జూన్ 2021 నుంచి రూ. 54,220 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు గుర్తించి, వారికి గౌరవాన్ని సీఎం నిలబెడుతూ ఇప్పుడు ఏకంగా క్రమబద్ధ్దీకరించాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 15, జూనియర్ కళాశాలలు 56, పాలిటెక్నిక్ కళాశాలలు 12 ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లో 83 మంది, జూనియర్ కళాశాలల్లో 431(మెదక్ జిల్లాలో 126, సంగారెడ్డి జిల్లాలో 133, సిద్దిపేట జిల్లాలో 172 మంది), పాలిటెక్నిక్ కళాశాలల్లో 82 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ ఉద్యోగ భద్రత కలగనుంది.
కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన మాటను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థకు సమైక్య పాలనలో అప్పటి పాలకులు బీజం వేశారు. సరిపడా వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టు అధ్యాపకులతో వెట్టిచాకిరి చేయించారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఉద్యమ నేతగా ఆనాడే చెప్పారు. అధికారంలోకి రాగానే జీవో 16ను జారీ చేశారు. అయితే గిట్టని ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి క్రమబద్ధీకరించే ప్రక్రియకు ఆటంకాలు సృష్టించాయి. అనంతరం కేసీఆర్ 2017లో సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేస్తూ బేసిక్ పే కల్పించారు. ఇంతటితో ఆగకుండా 2021లో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత డిసెంబర్లో క్రమబద్ధ్దీకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పడంతో అవరోధాలు తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణపై ఇటీవల శాసనసభలో ప్రకటన చేశారు.
మా ఉద్యోగానికి ఎప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన ఇన్నాళ్లు వెంటాడేది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ మఖ్యమంత్రి అయ్యాక మాకు భరోసా కలిగింది. సీఎం కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటన చేయడం ఎంతో సంతోషానిచ్చింది. మున్ముందు మరింత బాధ్యతతో పనిచేస్తాం. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబాలు రుణపడి ఉంటాయి.
-వినోద్ కుమార్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుడు
మా కష్టాలను అర్థం చేసుకొని మా ఉద్యోగాలను క్రమబద్ధ్దీకరించాలని సీఎం తీసుకున్న నిర్ణయం మా జీవితాల్లో వెలుగులు నింపినట్లు అయ్యింది. ప్రభుత్వ నిర్ణయంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తాం. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలన్నీ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాయి. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ సార్.
-ఫర్జానా జాబిన్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతున్నది. కాంట్రాక్టు అధ్యాపకుల బానిస సంకెళ్లను కేసీఆర్ ప్రభుత్వం బద్ధ్దలు కొట్టింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ వస్తే ఏమస్తదని విమర్శించే వారికి శాసనసభలో సీఎం తీసుకున్న నిర్ణయమే సమాధానం. దేశంలో ఎక్కడాలేని విధంగా రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం సార్‌కు రుణపడి ఉంటాం.
-పవన్‌కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకుడు,మెదక్