హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో రిజిస్ట్రార్ మార్పు వివాదం రాజుకున్నది. ప్రస్తుతమున్న రిజిస్ట్రార్‌ను తొలగించాలని సర్కార్ ఆదేశాలు జారీచేయడం.. వర్సిటీ వీసీ ససేమిరా అనడంతో గొడవ ముదురుతున్నది. శుక్రవారం వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది కూకట్‌పల్లిలోని క్యాంపస్‌లో ర్యాలీ తీయడం.. వీ స్టాండ్ విత్ వీసీ అంటూ నినాదాలు చేయడం కలకలం సృష్టించింది. ఇదే అంశంపై బీసీ సంఘం స్పందించింది. ప్రస్తుతమున్న రిజిస్ట్రార్‌ను తొలగించొద్దని డిమాండ్ చేసింది. ఈ పంచాయితీ సర్కార్ వద్దకు చేరింది. కొందరు సీఎంవోకు.. సీఎం సన్నిహితులకు ఫిర్యాదు చేశారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా కొంత కాలం క్రితం ప్రొఫెసర్ జయలక్ష్మిని వీసీ టీకేకే రెడ్డి నియమించారు. ఇంతకాలం రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు సైతం రిజిస్ట్రార్ పోస్టు రేసులో ఉన్నారు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు జయలక్ష్మికి అండగా ఉండగా.. మరికొందరు వెంకటేశ్వర్రావుకు మద్దతుగా ఉన్నారు. ఇదే అసలు వివాదానికి కారణమయ్యింది.
ప్రభుత్వం ప్రస్తుత రిజిస్ట్రార్‌ను తొలగించాలని ఆదేశించడం, ఇందుకు వీసీ అంగీకరించకపోవడంతో సర్కార్ వర్సెస్ వీసీ అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. శుక్రవారం రిజిస్ట్రార్ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ బోధన, బోధనేతర సంఘాల నేతలు వర్సిటీలో ర్యాలీ తీశారు. రిజిస్ట్రార్‌ను మార్చాలని సర్కార్ వీసీపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మీని తొలగించాలని తనపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తడిసిన కిషన్‌కుమార్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు రిజిస్ట్రార్‌ను తొలగించాలని గురువారం ఒత్తిడి తేవడమే కాకుండా.. గతంలో పనిచేసిన రిజిస్ట్రార్‌ను మళ్లీ కొనసాగించాలని ఆదేశించారని చెప్పారు. జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఒకే ఒక బీసీ మహిళకు మొదటిసారి అవకాశం లభించగా, కేవలం 45రోజుల్లోనే తొలగించాలని ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నిప్పులు చెరిగారు. ఇది బీసీ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. రిజిస్ట్రార్‌ను యథావిధిగా కొనసాగించాలని, లేదంటే జేఎన్టీయూను ముట్టడిస్తామని హెచ్చరించారు.