పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, పచ్చదనాన్ని పెంచుకోవడానికి.. పండుగలూ ఓ మార్గమే. దీపావళి నాడు కూడా దీపపు ప్రమిదల నుంచి పటాకుల వరకు అన్నిటినీ పర్యావరణానికి మేలు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రమిదల్లో విత్తనాలను పెట్టి విక్రయిస్తున్నారు. పండుగ పూట నిండుగా వెలిగించి, ఆ తర్వాత కుండీల్లో పెట్టి, కొన్ని నీళ్లు పోస్తే.. నిన్నటి వరకూ వెలుగునిచ్చిన ప్రమిద పచ్చదనాన్నీ ప్రసాదిస్తుంది. ఈసారి విత్తన పటాసులకూ డిమాండ్ పెరిగింది. ఒక్కో పటాసు ఒక్కోరకమైన విత్తనంతో వస్తున్నది. తయారీ దశలోనే భూచక్రాల్లో పూల విత్తనాలు, సుత్తిలి బాంబులో కూరగాయల విత్తనాలు, పూల చడీలు, రాకెట్లలో ఆకుకూర విత్తనాలు మొదలైనవి పెడుతున్నారు. ప్రమిదలపై డిజైన్లకు కూడా సహజమైన రంగులనే ఎంచుకొంటున్నారు. ఆత్మీయులకు అందించే గ్రీటింగ్ కార్డుల్లోనూ విత్తనాలు పెట్టి హరితహారానికి తమ వంతు మద్దతు అందిస్తున్నారు తయారీదారులు.