టెక్ దిగ్గజాలకు నాయకులుగా ఉన్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లను హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌లో వెనకకు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది జయశ్రీ ఉల్లాల్. భారతీయ కుటుంబంలో పుట్టి, ఢిల్లీలో పెరిగి అమెరికాలో నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న జయశ్రీ.. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సమర్థవంతమైన మహిళా నాయకురాలిగానే కాదు ప్రతిభావంతమైన టెక్ లీడర్‌గా టెక్నాలజీ రంగంలో ఎన్నో విజయాలు సాధించింది!
జయశ్రీ లండన్‌లో పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత జయశ్రీ తల్లిదండ్రులు బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో జయశ్రీ విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదివేందుకు అమెరికా వెళ్లింది. శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో బీఎస్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో చేరింది. అమెరికాలోనే శాంతాక్లారా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్) పూర్తి చేసింది. ఉన్నత చదువుల తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించింది.
జయశ్రీ ఫెయిర్చిల్డ్ సెమికండక్టర్ కంపెనీలో సీనియర్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెక్నాలజీ రంగంలోనే కొనసాగుతూ అనేక ఉన్నత స్థానాల్లో పని చేసింది. ఫెయిర్చిల్డ్ కంపెనీ నుంచి అడ్వాన్డ్స్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) కంపెనీలో చేరింది. అక్కడ పని చేస్తున్న కాలంలో ఐడీఎం, హిటాచి వంటి టెక్ కంపెనీల కోసం హైస్పీడ్ మెమరీ చిప్‌లను డిజైన్ చేసింది. తర్వాత పలు నెట్వర్కింగ్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసింది.
నెట్వర్కింగ్- క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ అరిస్టా కంపెనీలో 2008 నుంచి సీఈవో, ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అనేక విజయాలు సాధిస్తూ… సంస్థను విజయపథంలో నడిపింది.
నెట్వర్కింగ్ రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న అయిదుగురిలో ఒకరిగా ఫోర్బ్స్ మ్యాగజైన్ జయశ్రీని గుర్తించింది. 2018లో ప్రముఖ సంస్థ నుంచి వరల్డ్స్ బెస్ట్ సీఈవో అవార్డును అందుకుంది. ఆ మరుసటి ఏడాదిలో ఫార్చూన్స్ టాప్ ట్వంటీ బిజినెస్ పర్సన్స్ 2019 జాబితాలో స్థానం దక్కించుకుంది. లెక్కలేనన్ని అవార్డులు, గౌరవాలను దక్కించుకున్న జయశ్రీ 5.7 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన సంపదతో హురూన్ ఇండియా రిచ్ లిస్టులో చేరి మరోసారి వార్తల్లోకెక్కింది.
న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో షేర్లు లిస్ట్ అయిన అరిస్టా కంపెనీలో జయశ్రీకి మూడు శాతం వాటా ఉంది. ఆస్తులు, ఆదాయం మొత్తం కలిపి 5.7 బిలియన్ డాలర్ల సంపదతో జయశ్రీ భారతీయ టెక్ దిగ్గజాలందరిలోకీ అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానాల్లో సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) సందప విలువ 1.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 1.1 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నాడు.