వ్యవసాయ యూనివర్సిటీ , డిసెంబర్ 17 : భూసార పరిరక్షణ అనేది భవిష్యత్‌లోను చాలా కీలక అంశమని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ప్రవీణ్‌రావు అన్నారు. ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకున్న సందర్భంగా తన చాంబర్లో ఇండియన్ అగ్రానమి హైదరాబాద్ చాప్టర్ వారు శుక్రవారం ఘనంగా సత్కరించారు . సుమారు 40 ఏం డ్లు గా ప్రవీణ్‌రావు సూక్ష్మ సేద్యం , వ్యవసాయ రంగానికి చేసిన సేవలని సొసైటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించకపోతే ఆ దుష్ప్రభావాలు, నీటి వనరులు , జీవ వైవిద్యం , ఆహారం ఇలా అనేక రంగాలపై ప్రభావం ఉం టుందన్నారు.
ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సమావేశాల్లో చర్చ జరుగుతుందన్నారు.వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న వారు ప్రస్తుత సమాజంలో ఏ అంశం , ఏ సమస్య ఉన్నదో పరిశీలించి వాటిపై పరిశోధనలు చేస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. పరిమిత వనరులతో అధిక ఉత్పత్తి ఉత్పాదకతలు సాధించాల్సి ఉందన్నారు.
భవిష్యత్‌లో సూక్ష్మసేద్యంతోనే వరి సాగు చేయాల్సిన పరిస్థితులు రానున్నాయని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు .వ్యవసాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఇతర విషయాలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ పరమైన పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యార్థులకు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని దీనిపై నల్సార్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడం పై కసరత్తు చేస్తామన్నారు. కార్యక్రమంంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డా. జగన్మోహన్ రావు ,అగ్రానమిసొసైటీ ప్రతినిధులు జోసెఫ్, యాకాది, మల్లారెడ్డి, రవీంద్రాచారి, మహేంద్రకుమార్ పాల్గొన్నారు.