Janasena MLA : సైబర్ నేరగాళ్లు సామాన్యులతోపాటు వ్యాపారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన నేత చిర్రి బాలరాజుకు టోకరా ఇచ్చారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును కాజేశారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే బాలరాజు మొబైల్‌కు ఆర్టీఏ చలానా చెల్లించాలంటూ ఓ మేసేజ్ రావడంతో అందులో ఉన్న లింక్‌ను ఆయన నిజమైనదని భావించి క్లిక్ చేశారు. ఆ లింక్ ద్వారా ఆయన ఫోన్లో ఓ మాల్వేర్ యాప్ ఇన్స్టాల్ అయింది. అది క్లిక్ చేసిన కొద్దిసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ఇండ్ బ్యాంకులో ఉన్న ఆయన ఖాతా నుంచి సుమారు రూ.12 లక్షలు విత్‌డ్రా అయ్యాయి.
ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే బాలరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.