ధర్మపురి, మార్చి 25: ధర్మపురి లక్ష్మీ నారసింహుడి కల్యాణ వేడుకలు అశేష భక్తజనవాహిన మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో శాస్ర్తోక్తంగా దేవాలయంలోని శేషప్ప కళావేదికపై గురువారం అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీలక్ష్మీనారసింహ(యోగ,ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను శేషప్ప కళావేదిక వద్దకు చేర్చి పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి కల్యాణ వేదికపై అధిష్టింపజేశారు. యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో గోధూళి సముహూర్తాన స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జయ లక్ష్మీ నారసింహ జయజయ నారసింహ’ స్మరణతో ప్రాంగణమంతా మార్మోగింది. స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శేషప్ప కళావేదిక ముందు, ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. భక్తులకు వీలుగా ఎక్కడికక్కడ ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన కలెక్టర్..
స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం పక్షాన కలెక్టర్ రవి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పట్టువస్ర్తాలతో కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకున్న కలెక్టర్‌కు అర్చకులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మొదట లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో అర్చకులు పూజలు నిర్వహించి కలెక్టర్‌ను ఆశీర్వదించారు. అనంతరం పట్టువస్ర్తాలు, తలంబ్రాలను కలెక్టర్ ఈవో శ్రీనివాస్‌కు అందజేశారు. ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. విజయడెయిరీ ఆధ్వర్యంలో పంపిణీ చేసే మజ్జిగ ప్యాకెట్లను క్యూలైన్లో ఉన్న భక్తులకు అందజేశారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రుల సతీమణులు
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీమణి అల్లోల విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత, అడిషనల్ కలెక్టర్ రాజేశం, పురపాలక సంఘం పక్షాన మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
అద్భుతం నారసింహుడి ఆవిర్భావం..
నారసింహుని ఆవిర్భావం అద్భుతమని ప్రముఖ ప్రవచకుడు, జ్యోతిష్య పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ ప్రవచించారు. ఈ బ్రహ్మాండమంతా నారసింహమని, అన్నింటిలో విష్ణుతత్వం నిండి ఉంటుందన్నారు. అనంతరం హిందూ మతాన్ని గౌరవిస్తామని, హిందూ సంప్రదాయాలను కాపాడుకుంటామని భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు.