అమరావతి : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న , మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) పై మరోమారు ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసు ( Viveka Murder Case )పై బుధవారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.
అన్న అనే పదానికి వైఎస్ జగన్ కళంకం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అసలు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదని అన్నారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఎంపీ పదవికి అవానాష్ సరికాదని వివేకా స్వయంగా నాతో చెప్పుకున్నారని వెల్లడించారు. జగన్‌కు వివేకా ఎంత చెప్పినా కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారని ఆరోపించారు.
వివేకానందరెడ్డి బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డే అని అవినాష్ భావించారని షర్మిల తెలిపారు. వివేకా హత్యను గుండెపోటు అని ప్రచారం చేశారని, ఆ తరువాత వివేకాను సునీత భర్త హత్య చేశాడని అవినాష్‌రెడ్డి చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసును అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ సీఎం అయ్యారని ఆరోపించారు. వివేకా హత్యపై వైసీపీ నాయకులు వెలివేస్తేనే సునీత ఒంటిరి పోరాటం చేస్తోందని, మీరు న్యాయం చేయనందునే సునీతకు కర్మ పట్టిందని అన్నారు.సునీతకు సీబీఐ, బీజేపీ అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.