హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించిన షర్మిల కొంతకాలం మనుగడ సాగించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరడం సర్వత్రా చర్చనీయమైంది. కాంగ్రెస్ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పిన షర్మిల.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే స్పష్టత వస్తుందని అన్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అధికార వైఎస్సార్సీపీ నాయకులు పలు రకాలుగా స్పందించారు. వైఎస్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌పై కేసులు పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరీ టీడీపీని వదిలి బీజేపీలో చేరారని గుర్తుచేశారు.