AP News : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిచినందుకు జగన్ ప్రభుత్వం హయాంలోనే వెంకట్రామిరెడ్డి సస్పెండ్ అయ్యారని ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ నిజం ఒప్పుకుంటున్నాడని, ఎందుకంటే ఆయన చేసిన తప్పులకు జైల్లో పెట్టకుండా చంద్రబాబు తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఆ తప్పు చేయడంవల్లే జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024 ఏప్రిల్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాండక్ట్ రూల్స్‌ను బ్రేక్ చేసి కాకర్ల వెంకట్రామిరెడ్డి, చల్లా చంద్రయ్యలు వైసీపీ జెండాలు పట్టుకొని కడప జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల్లో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు. అవినీతి, పనిపట్ల నిబద్ధత లేకపోవడం, పనిచేయకపోవడం వంటి వాటికి కాండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.
2024 ఏప్రిల్ 2న బద్వేల్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్‌కు రిపోర్ట్ పెట్టారని, దాంతో అదే రోజున 137/2024, 81/2024, 116/2024, 166/2024 నాలుగు ఎఫ్ఐఆర్లు కాకర్ల వెంకట్రామిరెడ్డి, చల్లా చంద్రయ్యలపై నమోదయ్యాయని గుర్తుచేశారు. బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప డిపోల్లో వైసీపీ యూనియన్ నాయకుడు చల్లా చంద్రయ్యతో కలిసి వెంకట్రామిరెడ్డి వీసీకి అనుకూలంగా జెండాలు పట్టుకొని ప్రచారం చేశాడు కాబట్టే నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్ నమోదు అయిందని అన్నారు. 2024 ఏప్రిల్ 2న ఏపీలో జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు.
సచివాలయ ఉద్యోగిగా ఉండి ప్రచారం చేసినందుకు బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. జీఓ 464లో ఈ వివరాలు అన్నీ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కడప కలెక్టర్ నివేదిక ఇస్తే, దాని ఆధారంగా తమ ప్రభుత్వం విచారణ జరిపిందని అన్నారు. 2024 ఏప్రిల్ 18న నివేదిక ఇస్తే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెంకట్రామిరెడ్డిని పంచాయితీ రాజ్ సెక్రటరీ సస్పెండ్ చేశారని తెలిపారు. అప్పుడే ఆర్టీసీ ఉద్యోగి చల్లా చంద్రయ్యను కూడా సస్పెండ్ చేశారని వెల్లడించారు.