బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో (Karnataka Assembly Elections) ప్రధాన పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలతో చెలరేగుతున్నాయి. పరస్పర ఆరోపణలు, విమర్శలతో ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నాయి. లింగాయత్ సీఎం బసవ్‌రాజ్ బొమ్మై అవినీతిపరుడని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిద్ధరామయ్య లింగాయత్‌లను అవమానపరిచారని బీజేపీ ఆరోపణలు గుప్పించగా కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.
సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ అభ్యర్ధిగా హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన మాజీ సీఎం జగదీష్ శెట్టార్ సమర్ధించారు. సిద్ధరామయ్య కేవలం బసవరాజ్ బొమ్మైని ఉద్దేశించి వ్యాఖ్యానించారని, లింగాయత్ సీఎంలు అందరినీ ఆయన ప్రస్తావించలేదని శెట్టార్ పేర్కొన్నారు. లింగాయత్ సీఎం అవినీతిలో మునిగిపోయారని, ఇది కర్నాటకకు అవమానమని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లింగాయత్ సీఎం అవినీతికి పాల్పడ్డారని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు.
కన్నడిగులను అవమానించినందుకు సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలని ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. ఇక సిద్ధరామయ్య వ్యాఖ్యలను సమర్ధించిన లింగాయత్ నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టార్ పలువురు లింగాయత్ నేతలు కాషాయ పార్టీని వీడుతున్నారని, త్వరలోనే వారంతా కాంగ్రెస్ గూటికి చేరుతారని అన్నారు. బీజేపీకి ఓటు వేయవద్దని కర్నాటక ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలని పలువురు కాంగ్రెస్ అభ్యర్ధులు తనను కోరుతున్నానని అన్నారు.