Ashish Chanchalani | దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన టీజర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. మరోవైపు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లాని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ చిత్ర టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఆయన, టీజర్ మేకింగ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. టీజర్‌లోని విజువల్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించారని కొందరు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టాడు.
వారణాసి టీజర్లో కనిపించే ఒక్క షాట్ కూడా అసలు సినిమాలోనిది కాదని, కేవలం ఈ అనౌన్స్మెంట్ టీజర్ కోసమే ప్రతి ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా రెండర్ చేసి, ఎంతో శ్రమతో రూపొందించారని ఆశిష్ స్పష్టం చేశారు. ఇంతటి భారీ కష్టాన్ని గుర్తించకుండా, ఇది కేవలం AI సృష్టించిన విజువల్స్ అని కొందరు తెలివిలేని వారు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మహేష్ బాబును ‘రుద్ర’గా చూపిస్తూ ఎడారి, అంటార్కిటికా మరియు వారణాసి వీధుల్లో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ వెనుక VFX టీమ్ పడ్డ కష్టాన్ని తక్కువ చేయవద్దని ఆయన కోరారు. రాజమౌళి విజన్‌కు తగ్గట్టుగా అత్యున్నత సాంకేతికతతో ఈ టీజర్‌ను సిద్ధం చేశారని ఇందులో AI ప్రమేయం లేదని ఆశిష్ చెప్పుకోచ్చాడు.