చందుర్తి : వృద్ధాశ్రమం లక్ష్యంగా అసత్యపు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల (Congress leaders ) తీరు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉచ్చిడి రాజిరెడ్డి ( Rajireddy ) ఆరోపించారు. ఆదివారం చందుర్తి ( Chandurthi ) మండలం మల్యాల సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఇచ్చిన భూ పట్టాలను సరైనవి కాదని , స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సంబంధం లేదని ఆరోపించడం సరైనది కాదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం లింగంపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 216లో 90 ఎకరాల స్థలంలో వృద్ధాశ్రమానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారని వెల్లడించారు.
మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కాదని కేవలం వృద్ధాశ్రమానికి ఎదురుగా సబ్ స్టేషన్ నిర్మించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వృద్ధులు ఆశ్రమానికి ఎదురుగా నిర్మాణ పనులు చేపట్టడంతో శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎమ్మార్వో ఇతర పెద్దల మధ్యవర్తిత్వంతో ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమింప చేశారని తెలిపారు.
కొద్ది రోజుల వ్యవధిలోనే తిరిగి వృద్ధాశ్రమానికి ఎదురుగా సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టడం, తమను అక్రమంగా అరెస్టులు చేసి సీసీ కెమెరాల నిఘాతో పోలీసుల నిర్బంధంలో పనులు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. పండుటాకుల పైన కక్షగా వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ తరలించారని ఆరోపించారు.
ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం పై బురద జల్లుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు దయ్యాల కమలాకర్, కొట్టే లింగయ్య, పోతరాజు దేవరాజు, టేకుమళ్ళ రాజనర్సయ్య, హైదర్, ఎన్నం లింగయ్య, శ్రీరాముల రాములు,రాగుట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.