జీహెచ్ఎంసీలో అక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందాలంటే కష్టసాధ్యంగా మారింది. ఎంతలా అంటే కాళ్లు అరిగేలా తిరిగినా… ఓసీ పొందడం యజమానులకు ఇప్పుడు సవాల్‌గా మారింది. భవన నిర్మాణ అనుమతుల ప్రకారమే సంబంధిత నిర్మాణం పూర్తి చేసుకుని అక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీకి ఆప్లికేషన్ చేసిన సదరు నిర్మాణదారులకు ప్లానింగ్ విభాగం అధికారులు సరైన కారణం లేకుండా తిరస్కరిస్తున్నారు. అనుమతులు ఇచ్చే సమయంలో లేని నిబంధనను ఓసీ జారీలో చేర్చి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. ఇదేమని అడిగితే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో మీ నిర్మాణం లేదు అని ఎన్వోసీ తీసుకువస్తేనే ఓసీ ఇస్తామని.. ఇటీవల ప్లానింగ్ అధికారులు అడ్డగోలు నిబంధనలతో యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
– సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) :
ఎల్బీనగర్కు చెందిన రత్నమాల సాహేబ్‌నగర్ సిల్ట్ ఫ్లస్ ఐదు అంతస్తుల రెసిడెన్షియల్ భవనానికి అనుమతి (ఫైల్ ప్రొసిడింగ్ నంబరు 5301) పొందాడు. నిర్మాణ అనుమతి సమయంలోనే అన్ని పత్రాలతో పర్మిషన్ తీసుకుని నిబంధనల ప్రకారమే భవనాన్ని పూర్తి చేశాడు. నిర్మాణం పూర్తయ్యాక నివాసయోగ్యపత్రం (ఓసీ/అక్యుపెన్సీ సర్టిఫికెట్) జారీకి దరఖాస్తు(అప్లికేషన్ నంబరు 003795) చేసుకున్నాడు. అయితే సదరు యాజమానికి టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలా ఎఫెక్ట్ లేదని ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకురావాలని, అప్పుడే ఓసీ ఇస్తామంటూ సంబంధిత దరఖాస్తును తిరస్కరించారు. భవన నిర్మాణ సమయంలోనే ఏదైన ఉంటే అడగాలే కానీ.. భవనం పూర్తయ్యాక ఓసీ సమయంలో కొత్త నిబంధన పెట్టడం ఎంత వరకు సమంజసమని సదరు యజమాని ప్రశ్నించినా.. దరఖాస్తును తిరస్కరించారు.
వాస్తవంగా ఈ భవనానికి కనుచూపు మేరలో ఎలాంటి చెరువు, నాలా లేకున్నా.. ఎన్వోసీ అడిగిన తీరు టౌన్‌ప్లానింగ్‌లో అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నది. ఓసీ తీసుకుని కరెంట్, వాటర్, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చి కొనుగోలు చేసిన వారికి ప్లాట్లు అప్పగిద్దామనుకున్న సదరు యజమానికి అధికారుల నుంచి చుక్కెదురు కావడం గమనార్హం. హైడ్రా బూచీతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అడ్డదారిలో వచ్చిన వారికి ఏ నిబంధనలు చూడకుండా నిర్మాణ రంగ అనుమతులు ఇస్తున్నారని పలువురు యజమానులు మండిపడుతున్నారు. అధికార వికేంద్రీకరణతో సరిల్ , జోనల్ కార్యాలయాల్లోనే మెజార్టీ భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. యేటా 12 నుంచి 13 వేల భవనాలకు పర్మిషన్ ఇస్తున్నారు. ఇందులో తక్షణ అనుమతి పొందుతున్న దరఖాస్తులే
జోనల్ కార్యాలయాల్లో పోస్ట్ వెరిఫికేషన్‌లో ఆలస్యమవుతోంది. అనేక సార్లు సంప్రదిస్తే కానీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేదు. వాస్తవానికి ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో వందల సంఖ్యలో నిర్మాణ రంగ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఏసీపీ, సీపీ, జోనల్ కమిషనర్ల మధ్య సమన్వయ లోపంలో ఎక్కువ శాతం వివిధ కారణాలతో షార్ట్ఫాల్తో తిరస్కరణకు గురవుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఓసీ కోసం వచ్చిన అప్లికేషన్ తిరసరించిన పక్షంలో సహేతుక కారణం ఉండాలి. కానీ కారణం లేకుండా వందల సంఖ్యలో అప్లికేషన్లు తిరసరిస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల చేయి తడిపితే చాలు ఓసీలు ఠంచనుగా జారీ అవుతుండడం గమనార్హం.
జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోతున్న కొందరు వాణిజ్య వ్యాపారస్తులు.. ఓసీలు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఇటీవల సీజ్ చేసిన షాపింగ్ మాల్ ఇందుకు ఉదాహరణ. ఒక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోనే కాదు బంజారాహిల్స్ రోడ్ నం 10 కార్వీ సమీపంలో ఓ వాణిజ్య సముదాయానికి ఓసీ లేకుండా బడా షాపింగ్ మాల్ యధేచ్ఛగా కొనసాగుతున్నది. ఓసీల జారీలో కమిషనర్ జోక్యం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని బాధిత యజమానులు కోరుతున్నారు.