హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి పైరవీకారులుగానే చూస్తున్నారా? వారు నియోజకవర్గంలోని సమస్యల పరిషారం కంటే, సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన భావిస్తున్నారా? తన వద్దకు వస్తున్న ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది పైరవీల కోసమే వస్తున్నారని తన సన్నిహితుల వద్ద చెప్పుకొన్నారా? తనను కలువడానికి వచ్చిన ఎమ్మెల్యేలకు అందుకే సమయం ఇవ్వడం లేదా? తన కోసం ఎవరు వచ్చినా తన మిత్రుడు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డినే కలిసి వెళ్లాలని సూచిస్తున్నారా? అంటే ‘అవును’అనే సమాధానమే వినిపిస్తున్నది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలేసి పైరవీల మీదనే ఫోకస్ పెడుతున్నారని, తన వద్దకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక పైరవీ పేపర్ ఇవ్వడం తప్పితే, నియోజకవర్గ సమస్యలపై చర్చ పెట్టడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మావోళ్లలో రాజకీయాల్లో రాణించాలనే తపన కంటే.. అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలనే ఆలోచననే ఎక్కువ ఉన్నది’ అని ఇటీవల తన సన్నిహితుల వద్ద అన్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
సాధారణంగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తమ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసువెళ్లి, వాటిని పరిషరించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తారని, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలను అస్సలు ప్రస్తావించడం లేదని, కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు, భూ వివాదాలు, రాష్ట్ర స్థాయి అధికారుల పైరవీలతోనే వస్తున్నారని, వీటి కోసమే పదేపదే సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం సన్నిహిత వర్గం బహిరంగంగానే ప్రచారం చేస్తున్నది. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో నిత్యం పత్రికలు, చానళ్లలో కనిపించే దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే భూ వివాదాలు మినహా మరో పేపర్ పట్టుకొని సీఎం వద్దకు రారు అని ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్తున్నారు.
కానీ ఆయన నోరు విప్పితే అవినీతి గురించి మాట్లాడుతారని అంటున్నారు. భూ వివాదంలోనే సదరు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి గతంలో ఒక పోలీస్ అధికారి మీద ప్రివిలేజ్ మోషన్‌కు ప్రయత్నించినట్టు సీఎం సన్నిహిత వర్గం చెప్తున్నది. ఇంకొంత మంది ఎమ్మెల్యేలు అధికారులకు పోస్టింగ్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని, ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏసీబీ కేసుల్లో ఇరుకున్న అధికారులపై చర్యలు లేకుండా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సీఎం అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు నెలల తరబడి ఎదురుచూస్తున్నట్టు తెలిసింది. ఎవరు అపాయింట్మెంట్ అడిగినా వేం ను కలువాలని సూచిస్తున్నట్టు సమాచారం. తొలకరి కురిసి పక్షం రోజులు దాటింది, రైతులకు యూరియా అందుబాటులో లేదు, కొన్ని చోట్ల వడ్లు కల్లంలోనే ఉన్నాయి. గ్రామాల్లో ఈ రెండు అంశాలు ప్రధాన సమస్యగా ఉన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేయటానికి తాను వచ్చినా సీఎం కలువడం లేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదని, నిధులిచ్చేంత అర్థిక వ్యవస్థ లేదని, దాని బదులు నెలకు రూ.5 కోట్ల చొప్పున కాంట్రాక్టు బిల్లులు తెచ్చుకోవాలని స్వయంగా సీఎం తమకు సూచించారని మరో ఎమ్మెల్యే వివరించారు. తీరా ఇప్పుడు తమను కమీషన్ పైరవీల కోసం వస్తున్నట్టు బద్నాం చేస్తున్నారని సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డిని కలిస్తే ఒక్క పని కూడా కావడం లేదని, ఆయనకు ఇచ్చిన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయని మరో ఎమ్మెల్యే వాపోయారు. కాగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల మీద దృష్టిపెట్టడం లేదని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.