Unicef : ఇజ్రాయిల్ గత మూడు వారాలుగా లెబనాన్‌పై జరుపుతున్న కర్కశ దాడుల్లో లెబనాన్‌లోని ప్రతి చిన్నారి ప్రభావితమయ్యారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు నాలుగు లక్షల మందికిపైగా లెబనాన్ చిన్నారులు నిరాశ్రయులయ్యారని యునిసెఫ్ పేర్కొంది. నిరాశ్రయులైన చిన్నారులు కిక్కిరిసిన శిబిరాల్లో ఉంటున్నారని, ప్లాస్టిక్ షీట్‌తో వేరుచేసిన గదుల్లో మూడు నాలుగు కుటుంబాలతో కలిసి తలదాచుకుంటున్నారని హ్యూమనిటేరియన్ యాక్షన్స్ ఫర్ యునిసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టెడ్ చైబాన్ చెప్పారు.
ఇప్పుడు మనం చర్చించుకునే అంశం చాలా నిరాశకు గురిచేసిందని, 12 లక్షల మందికిపైగా చిన్నారులు విద్యకు దూరమయ్యారని, లబనాన్ ఓ తరాన్ని కోల్పోతున్నదని టెడ్ చైబాన్ అన్నారు. యుద్ధంలో ధ్వంసం కావడంవల్ల, శరణార్థి శిబిరాలుగా వినియోగించడంవల్ల లెబనాన్‌లో పాఠశాలలు పిల్లలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. క్షిపణులు, తుపాకుల మోతలతో నిరాశ్రయులైన చిన్నారులు తీవ్రమైన హింసాత్మక పరిస్థితులను ఎదుర్కొన్నారని, ఏ పెద్ద శబ్దమైనా వారిని భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పారు.
మనం సంరక్షణ చర్యల్లో ఇంకా ప్రారంభదశలోనే ఉన్నామని, కానీ అక్కడ ప్రభావం తీవ్రంగా ఉందని టెడ్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ దాడులతో 100కు పైగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు ధ్వంసమయ్యాయని అన్నారు. 12 ఆస్పత్రులు పాక్షికంగా పనిచేస్తున్నాయని, దీర్ఘకాలం పనిచేసే పరిస్థితులు లేవని చెప్పారు. మంచినీటి మౌలిక సదుపాయం కూడా దాడులతో ప్రభావితమైందని, సుమారు 3.50 లక్షల మందికి నీటిని అందించే 26 నీటి శుద్ధి ప్లాంటులు దెబ్బతిన్నాయని అన్నారు.
పౌర మౌలిక సదుపాయాలను రక్షించాలని అంతర్జాతీయ సమాజానికి టెడ్ పిలుపునిచ్చారు. లెబనాన్, గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని అభ్యర్థించారు. రాజకీయ సంకల్పం, సైనిక మార్గాల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించలేమని గ్రహించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. కాగా ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో ఇప్పటివరకు 2,300 మందికిపైగా మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.