Benjamin Netanyahu | టెల్ అవీవ్: ఈ ఏడాది సెప్టెంబర్ 17, 18 తేదీల్లో లెబనాన్ వ్యాప్తంగా జరిగిన పేజర్ల పేలుళ్లకు తామే కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తొలిసారిగా అంగీకరించారు. పేజర్ల పేలుడుకు ఇజ్రాయెలే కారణమని నెతన్యాహూ బహిరంగంగా అంగీకరించారని ఇజ్రాయెల్ న్యూస్ ఏజెన్సీ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, యెడియోత్ అహ్రోనత్ తెలిపాయి. అంతేకాకుండా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తామే హతమార్చామని ఆయన చెప్పారు. హెజ్బొల్లాపై మిలిటరీ చర్యలను తమ రక్షణ శాఖలోనే కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం?
గాజా: ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణను ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై యూఎన్వో భద్రతా మండలి తీవ్రంగా స్పందించిందని, దాడులు ఆపకుంటే ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో పరిమిత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ యోచిస్తున్నట్టు తెలిసింది.