రఫా (గాజా స్ట్రిప్): ఇజ్రాయెలీ సంస్థ సహకారంతో గాజా స్ట్రిప్‌లో నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రానికి దాదాపు ఓ కిలోమీటరు దూరంలో ఇజ్రాయెల్ దళాలు ఆదివారం దాడులు చేశాయి. గాజా ఆరోగ్య శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేంద్రానికి ఆహారం కోసం వస్తున్న వారిలో 31 మంది ఈ దాడుల్లో మరణించారు, సుమారు 170 మంది గాయపడ్డారు. ఈ ఫౌండేషన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఆదివారం ఉదయం తాము ఆహార పంపిణీ చేసినపుడు ఎటువంటి దాడి జరగలేదని పేర్కొంది. తాము సహాయం చేస్తున్న చోట్ల తొక్కిసలాట, కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఇవి ఇజ్రాయెల్ సైనిక ప్రాంతాలని, అక్కడికి వ్యక్తిగతంగా వెళ్లే అవకాశాలు పరిమితమని తెలిపింది.