జెరూసలెం: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీకి పడుతుందని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ మాట్లాడుతూ, ‘యుద్ధ నేరాలకు పాల్పడవద్దని, ఇజ్రాయెల్ పౌరులే లక్ష్యంగా క్షిపణి దాడులు కొనసాగించవద్దని ఇరాన్ నియంత ఖమేనీని హెచ్చరిస్తున్నా’ అని కట్జ్ హెచ్చరికలు జారీచేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వెళ్లిన పక్కదేశం నియంత (సద్దాం హుస్సేన్)కు ఎలాంటి గతి పట్టిందో అతడికి (ఖమేనీ) గుర్తుచేస్తున్నామని కట్జ్ అన్నారు. అమెరికా నేతృత్వంలోని సైనిక బలగాలు 2003లో ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ను గద్దె దించిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో మూతపడ్డ విమానాశ్రయాలు
బీరుట్: ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నాయి. దాదాపు అన్ని విమానాశ్రాయల్లో విమాన సర్వీసులను గల్ఫ్ దేశాలు నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇరాన్, ఇరాక్‌లో వేలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, ముఖ్యంగా ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్న వేలాది మంది భారత విద్యార్థులు వర్సిటీ హాస్టల్స్‌ను వీడలేని పరిస్థితి ఏర్పడిందని తెలిసింది. దీనిని ‘డామినో ఎఫెక్ట్’గా ఏవియేషన్ నిపుణులు పేర్కొంటారు. దాదాపు 10 వేల మంది ప్రయాణికులపై డామినో ఎఫెక్ట్ ఉందని తెలిసింది. ‘హఠాత్తుగా వేలాది మంది విమాన ప్రయాణికులు ఉండాల్సిన చోట లేరు. విమానాలు ఉండాల్సిన చోట లేవు’ అని ఏవియేషన్ నిపుణుడు జాన్ కాక్స్ చెప్పారు.