బొల్లారం, మార్చి 19: ఇదేనా బీజేపీ రామభక్తి? రామభక్తుడి ఆలయాన్నే మూసేస్తారా? కంటోన్మెంట్ పరిధిలోని ఏడో వార్డులో ఉన్న తిరుమలగిరి లాల్‌బజార్ హనుమాన్ దేవాలయం రెండేండ్లుగా మూసి ఉన్నది. వందేండ్ల ప్రాశస్త్యం ఉన్న ఈ గుడిలో ప్రస్తుతం ధూపం లేదు, దీపం లేదు.. దేవుడికి నైవేద్యం లేదు. అసలు గుడి తలుపులే తెరవలేదు. కరోనా మొదలైనప్పుడు కంటోన్మెంట్ ఆర్మీ అధికారులు ఈ ఆలయాన్ని మూసేశారు. గుడిని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కరోనా ప్రభావం తగ్గాక మిగతా చోట్ల అన్ని ఆలయాలు తెరుచుకొన్నా, ఆర్మీ అధికారులు మాత్రం ఈ హనుమాన్ ఆలయ తలుపులు తెరవలేదు. భద్రత కారణాలు అంటూ ఆలయంతో పాటు రోడ్డును కూడా మూసివేశారు. ఎక్కడైనా ఆలయానికి సంబంధించి చిన్న అంశమైనా, దాన్ని రాద్ధాంతం, రాజకీయం చేసే బీజేపీ నాయకులు ఈ హనుమాన్ దేవాలయం విషయంలో మాత్రం నోరు విప్పకపోవటం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీవాళ్లే, కేంద్రం చెప్పుచేతల్లో ఉండేది ఆర్మీ. మరి ఆర్మీ అధికారులు గుడిని మూసి ఉంచితే, వీళ్లేం చేస్తున్నట్టు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు ఎంసీఈఎంఈ అధికారులను చాలాసార్లు కలిసి విన్నవించారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న సైతం ఆర్మీ అధికారులకు విన్నవించుకొన్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయినా, స్పందన లేదు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని అలంకరిస్తామంటూ వివాదానికి ఆజ్యం పోసి, మేము మాత్రమే రామ భక్తులం అని గొప్పలు చెప్పుకొనే బీజేపీ నేతలు.. అసలైన రామభక్తుడిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలోనే ఇలా జరుగుతున్నా.. ఆయనా నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హనుమాన్ ఆలయం తెరవాలని శనివారం స్థానికులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. వచ్చే హానుమాన్ జయంతిని ఎక్కడ జరుపుకోవాలని నిలదీశారు. ఇప్పటికైనా ఆర్మీ అధికారులు స్పందించి దేవాలయాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.