Radhika Apte Turns to director | ఇప్పుడున్న నటీనటులు కేవలం నటనకే పరిమితం అవ్వాలని అనుకోవట్లేదు. చాన్స్ వస్తే దర్శకులుగా, నిర్మాతలుగా పలు విభాగాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అలా ఎందరో నటనను కొనసాగిస్తూనే ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే మెగాఫోన్ పట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిపింది. బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇటీవలే ఆమె నటించిన మోనికా ఓ మై డార్లింగ్ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
తాజాగా ఓ ఇంటర్వూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదటి భావించినట్లు చెప్పుకొచ్చింది. అయితే అనూహ్యంగా నటిని అయ్యానని చెప్పింది. అంతేకాకుండా తాను ఇప్పటికే దర్శకత్వ విభాగంలో శిక్షణ కూడా పొందినట్లు తెలిపింది. చాలా కాలంగా మెగాఫోన్ పట్టాలని అనుకుంటున్నట్లు, అన్ని కుదిరితే త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పింది. అయితే అంతకంటే ముందు స్క్రీన్‌ప్లేపై పట్టు సాధించాలని, దాని కోసం కొందరు దర్శకుల వద్ద పనిచేయాలని ఉందని తెలిపింది. ఇక అదే టైమ్‌లో కథలను కూడా సిద్ధం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇప్పటికే కంగాన రనౌత్, రేవతి, నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్ వంటి నటీమణులు దర్శకురాళ్లుగా మారి సక్సెస్ అయ్యారు.
కాగా రాధికా నటనకు మాత్రం స్వస్థీ చెప్పనని, తొలి ప్రాధాన్యత నటనకేనని వెల్లడించింది. ప్రస్తుతం రాధికా ఆప్టే నటిగా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు బాలకృష్ణ సరసన ‘లేజెండ్’, ‘లయన్’ సినిమాలు చేసింది. ఇక రజినీతో ‘కబాలి’ సినిమా చేసింది. ఇద్దరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ అమ్మడుకు సౌత్‌లో అవకాశాలు కరవైయ్యాయి.