iPhone 17 | ఐఫోన్ కొత్త సిరీస్‌కు విడుదలకు ముందు నుంచే మంచి డిమాండ్ లభిస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించడానికి ముందే.. అన్ని మొబైల్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలోని ఐఫోన్ యూజర్లలో 70 శాతం మంది ఐఫోన్ 17 సిరీస్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని భావిస్తున్నారని తెలిసింది.
సెప్టెంబర్ 17వ తేదీన ఐఫోన్ 17 సిరీస్ లాంచింగ్ ఈవెంట్ ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ప్రైజ్ కంపారిజన్ సైట్ ‘సెల్‌సెల్’ (sellcell) ఆగస్టులో ఒక సర్వే నిర్వహించింది. రెండు వేల మందికి పైగా ఐఫోన యూజర్లపై ఈ సర్వే చేసింది. ఇందులో 68.3 శాతం మంది ఐఫోన్ 17 కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అదే గత ఏడాది ఐఫోన్ 16 విడుదలకు ముందు సర్వే నిర్వహించగా.. అప్‌గ్రేడ్ అయ్యేందుకు 61.9 శాతం మంది ఉత్సాహం చూపించారు. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి 1.4 శాతం డిమాండ్ పెరిగింది.
ఐఫోన్ 17 సిరీస్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకునేవారిలో ఎక్కువ మంది ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌కే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని సర్వేలో తెలిసింది. ఈ మోడల్స్ కోసం 38.1 శాతం మంది యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సర్వేలో సాధారణ ఐఫోన్ 17ను 16.7 శాతం మంది ఎంచుకోగా.. కొత్తగా రాబోతున్న అల్ట్రా థిన్ ఐఫోన్ 17 ఎయిర్‌ను 13.5 శాతం మంది ఎంచుకున్నారు. ఇక ఫోల్డబుల్ ఐఫోన్ కోసం కేవలం 3.3 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపించారు.
ఈ సర్వేలో భాగంగా ఐఫోన్ 17 సిరీస్‌లోకి ఎందుకు అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నారని అడిగారు. అందుకు ప్రధానంగా 53 శాతం మంది బ్యాటరీ లైఫ్ కోసమే అని చెప్పడం గమనార్హం. దాని తర్వాత కొత్త డిజైన్, ఫీచర్ల కోసం అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నామని 36.2 శాతం మంది చెప్పారు. డిస్ప్లే టెక్నాలజీ కోసం 34.3 శాతం మంది, కెమెరా కోసం 28.1 శాతం మంది అప్‌గ్రేడ్ అవ్వాలని అనుకుంటున్నామని సర్వేలో తెలిపారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అప్డేట్ కావాలని అనుకునే వారు కేవలం 7 శాతం మంది మాత్రమే ఉన్నారు.
ఫోల్డబుల్ ఐఫోన్ విషయంలో ఇతర మొబైల్ తయారీ కంపెనీల నుంచి ఆపిల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. వచ్చే ఏడాది 2026లోపు యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాకపోతే.. 20 శాతం మంది యాపిల్ యూజర్లు శామ్సంగ్, 10 శాతం మంది గూగుల్ పిక్సెల్ మొబైల్ వైపు వెళ్లే అవకాశం ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. అయితే యాపిల్ బ్రాండ్‌పై నమ్మకం ఉన్న 70 శాతం మంది యూజర్ల ఆలోచనలో మాత్రం మార్పు రాలేదని సర్వే పేర్కొంది.
ఈసారి అల్ట్రాథిన్ మొబైల్‌ను ఐఫోన్ లాంచ్ చేస్తుండటంతో.. కొత్త డిజైన్‌పై 47.5 శాతం మంది యూజర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో తెలిసింది. స్లిమ్ మోడల్ కోసం బ్యాటరీ లైఫ్‌ను త్యాగం చేయడానికి కూడా సిద్ధమని వారు చెప్పడం గమనార్హం. కాగా 30 శాతం మంది సన్నగా ఉండే మోడళ్లపై ఆసక్తి చూపించలేదు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపై మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. 44 శాతం మంది ఏఐ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మూడో వంతు యూజర్లు మాత్రం ఏఐ ఫీచర్లపై ఆసక్తి చూపించలేదు. ఏఐ రంగంలో ముందున్న కంపెనీగా యాపిల్‌ను 44 శాతం మంది పేర్కొన్నారు. అదే శామ్సంగ్, గూగుల్‌ను 6.6 శాతం మందే తెలిపారు.
అప్‌గ్రేడ్ అవ్వడంలో ఐఫోన్ ధరనే ప్రధాన అడ్డంకిగా మారిందని సర్వేలో తెలిసింది. కొత్త సిరీస్‌కు అప్‌గ్రేడ్ అవ్వడానికి ధరే ప్రధాన సమస్యగా ఉందని 69 శాతం మంది సర్వేలో తెలిపారు. ఇక 71 శాతం మంది తమ ప్రస్తుత మొబైల్‌తోనే సంతృప్తిగా ఉన్నామని పేర్కొన్నారు. కొత్త ఐఫోన్ ధరలు పెరిగితే తమ అప్‌గ్రేడ్‌ను వాయిదా వేస్తామని 36.8 శాతం మంది తెలిపారు. మూడొంతుల మంది మాత్రమే ధర ఎంత పెరిగినా ఐఫోన్‌ను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.