మాకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కొడుకు. అమ్మాయి ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం
చదువుతున్నది. బాబు ఇంటర్. ఈమధ్యే మేం నాలుగు లక్షల రూపాయల చిట్టీ ఎత్తుకున్నాం. మా అమ్మాయికి నాలుగేండ్ల తర్వాత పెండ్లి చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ డబ్బుతో అమ్మాయి పెండ్లి కోసం ముందే బంగారం
కొనిపెడితే బాగుంటుందని మా ఆలోచన. అయితే మా బంధువుల్లో ఒకరు ఇ-బంగారం కొనమని సలహా ఇచ్చారు. దీనివల్ల లాభనష్టాల గురించి మాకు తెలియదు. దయచేసి వివరించండి. – ఓ గృహిణి
జ: నేరుగా బంగారు ఆభరణాలు కొనకుండా ఇ-గోల్డ్‌కు వెళ్లాలనే ఆలోచన మంచిదే. ఎందుకంటే ఆభరణాల డిజైన్ పాతబడినప్పుడు లేదా నచ్చనప్పుడు వాటిని చెడగొడితే తరుగు, తయారీ చార్జీల పేరుతో చాలా నష్ట పోవాల్సి వస్తుంది. అదే ఇ-గోల్డ్ అయితే ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ రోజు ఉన్న ధరను పొందవచ్చు. కానీ ఒకేసారి రూ.4 లక్షలు పెట్టి మామూలు బంగారమైనా, డిజిటల్ బంగారమైనా కొనడం సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. బంగారం ధర రోజురోజుకూ మారుతూ ఉంటుంది. మీ అమ్మాయి పెండ్లి నాటికి ఇప్పటి కంటే తగ్గొచ్చు కూడా. మార్కెట్ పరిస్థితుల్ని ముందుగా ఊహించడం కష్టం. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బును తక్కువ రిస్క్‌గల స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ నాలుగేండ్లలో.. చేతిలో డబ్బు ఉన్నప్పుడు కొంత కొంత ఇ-గోల్డ్ తీసుకోవచ్చు. బంగారం ధర భారీగా తగ్గినప్పుడు, మామూలు బంగారం కూడా కొంతవరకు కొనుక్కోవచ్చు. అంతే తప్ప, కేవలం బంగారం కోసమే పెద్దమొత్తాన్ని ఖర్చు చేయడం సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. మదుపులో వైవిధ్యం చాలా ముఖ్యం.
–దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్