బచ్చన్నపేట జూన్ 24 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని, కేవలం స్థానిక సంస్థలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రైతు భరోసా అందించిందని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. మంగళవారం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు వరుసగా రైతుబంధు అందించిందని, కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రెండేళ్లు ఎగ్గొట్టిందని విమర్శించారు.
తిరిగి ఇప్పుడు ఒక్కసారి రైతుబంధువేసి సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం స్థానిక సంస్థలు ఎన్నికల్లో తిరిగి ఓట్లు పొందేందుకే ఈ రైతు భరోసా వేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రతి చెరువు గోదావరి జలాలతో కల కల లాడిందని అన్నారు. కాంగ్రెస్ అధికారకు లోకి వచ్చాక చెరువులు కుంటలు ఎండిపోయి ఎక్కిరిస్తున్నాయనిపేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, మాజీ ఎంపిటిసి కర్నాల వేణుగోపాల్, నాయకులు బాలచందర్, బోడిగం గోవర్ధన్ రెడ్డి, కాపర్తి హరిప్రసాద్, గుర్రాల అనిల్ రెడ్డి, పందిపెళ్లి సిద్దిరాం రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.