బ్యాంకాక్: థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా ఇటీవల ప్రెస్మీట్లో మీడియా ప్రశ్నలకు అసహనానికి గురయ్యారు. ఒక్కసారిగా మాట్లాడటాన్ని ముగించిన ఆయన వేదిక ముందు కూర్చొన్న జర్నలిస్టుల వద్దకు వచ్చి వారి ముఖాలపై శానిటైజర్ చల్లారు. ఆ జర్నలిస్టులు దీనిని తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మాజీ ఆర్మీ జనరల్ అయిన ప్రయూత్ చాన్ ఓచా, 2014లో సైనిక తిరుగుబాటు నుంచి థాయిలాండ్ ప్రధానిగా ఉన్నారు. ఈ నెల 10న బ్యాంకాక్‌లోని ప్రభుత్వ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏడేండ్ల కిందట సైనిక తిరుగుబాటు సమయంలో నిరసనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు మంత్రులను జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆ కేబినెట్ పదవులను ఎవరితో భర్తీ చేస్తారని జర్నలిస్టులు ప్రశ్నించారు. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయని అడిగారు.
దీంతో ప్రధాని ప్రయూత్ చాన్ అసహనానికి గురయ్యారు. ఇంకేమైనా అడగాల్సింది ఉందా అంటూ జర్నలిస్టుల వద్దకు వచ్చి వారి ముఖాలపై శానిటైజర్ చల్లుతూ వెళ్లారు. ఈ సందర్భంగా తన ముక్కును మాస్క్‌తో మూసుకున్నారు. వెళ్తూ వెనక్కి తిరిగి శానిటైజర్ చల్లుతూనే మాట్లాడారు. ‘ఈ విషయం నాకు తెలియదు. ప్రధాని మొదట తెలుసుకోవలసిన విషయం కాదా?’ అని ప్రశ్నించారు.
కాగా, థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ఆయన తన భారీ సైజ్ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాండేందుకు నిరాకరిస్తూ.. ఈ వ్యక్తిని ప్రశ్నలు అడగండి అంటూ తన ఫోటోను చూపారు. 2014లో టీవీ కెమెరా సిబ్బందిపై అరటి తొక్క విసిరారు. అదే ఏడాది ఒక రిపోర్టర్ తలపై కొట్టి అతడి చెవిని లాగారు.
Thai prime minister sprays hand sanitizer at journalists who are seen trying to shield their faces pic.twitter.com/rEcOeqYxCt
— Reuters (@Reuters) March 9, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.