IRCTC Special Tour | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సరస్వతీ పుష్కరాల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ్, కోణార్క్ సత్యనారాయణ దేవాలయం, గయాలోని విష్ణుపాదం టెంపుల్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం, టెంపుల్ కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి, గంగాహారతిని చూడొచ్చు. అలాగే, అయోధ్య రామమందిరం, హనుమాన్ గర్హి, సరయూ నదిలో హారతి, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి వెళ్లొచ్చు. భారత్ గౌరవ్ రైలులో ఈ పర్యటన కొనసాగనున్నది. ప్యాకేజీలో పది రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటన ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, భోనగిరి, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా సాగుతుంది. ఈ ప్యాకేజీలో పర్యటన మే 8న ప్రారంభమవుతుందని ఐఆర్సీటీసీ టూరిజం తెలిపింది.
ఈ ప్యాకేజీలో తొమ్మిది రాత్రులు, పది రోజుల పర్యటన ఉంటుంది. తొలి రోజు అంటే మే 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మధ్యాహ్నం ఒంటిగంటకు రైలు బయలుదేరుతుంది. రెండోరోజు ఉదయం 2.45 గంటలకు రైలు విజయనగరం చేరుకుంటుంది. ఇక అదేరోజు ఉదయం 9 గంటలకు మల్తీపట్పూర్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా పూరీ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అవుతారు. లంచ్ పూర్తి చేసుకొని పూరీ జగన్నాథ్ఆలయానికి దర్శానికి వెళ్తారు. రెండోరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక మూడోరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకొని కోణార్క్ సూర్యనారాయణ దేవాలయ సందర్శనకు వెళ్తారు. ఆ తర్వాత మల్తీపట్పూర్ రైల్వేస్టేషన్‌కి చేరుకుంటారు. రైలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్ మీదుగా రైలు గయాకు బయలుదేరి వెళ్తుంది.
ఇక నాలుగో రోజు ఉదయం 9.30 గంటలకు రైలు గయా రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. ఆ తర్వాత హోటల్‌కు చేరుకని ఫ్రెషప్ అవుతారు. విష్ణుపాద్ ఆలయం దర్శానికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది. ఇక ఐదురోజు ఉదయం అల్పాహారం ముగించుకొని ఉదయం 8గంటలకు వారణాసికి బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బెనారస్ రైల్వే స్టేషన్‌కు చేరుతారు. అక్కడి నుంచి సారనాథ్కి చేరుకొని అక్కడే బస చేస్తారు. ఆరో రోజు వారణాసిలోనే ఉంటారు. కాశి విశ్వనాథ్ఆలయం, విశాలక్షి, అన్నపూర్ణ అమ్మవారి ఆలయాలను దర్శిస్తారు. సాయంత్రం గంగాహారతిలో పాల్గొంటారు. రాత్రి వారణాసిలోనే బస చేస్తారు. ఏడో రోజు ఉదయం 7 గంటలకు బెనారస్నుంచి అయోధ్యకు ప్రయాణం ఉంటుంది.
ఏడో రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు అయోధ్యకు చేరుతారు. అక్కడ బాల రాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించి.. సాయంత్రం సరయూ నది వద్ద హారతిని తిలకిస్తారు. రాత్రి 11.30 గంటలకు రైల్వేస్టేషన్‌కి చేరుకొని ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్తారు. ఎనిమిదో రోజు ఉదయం 4.30 గంటలకు ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాతి గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. తొమ్మిదో రోజు మొత్తం రైలు ప్రయాణం ఉంటుంది. పదో రోజు ఉదయం 9 గంటలకు రైలు విజయనగరం చేరుతుంది. ఇక చివరగా రైలు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీలో మూడురకాల కేటగిరిలు ఉన్నాయి. ఎకానమీ క్లాస్‌లో స్లీపర్ కాస్‌లో ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.16,800గా ధర నిర్ణయించింది. ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.15,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్టాండర్డ్ కేటగిరిలో థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరికి రూ.26,600 చెల్లించాలి. పిల్లలకు అయితే రూ.25,300 చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ కేటగిరిలో సెకండ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ఇందులో ఒక్కరికి రూ.34,900 చెల్లించాలి. పిల్లలకు రూ.33,300 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఈ ప్యాకేజీలోనే వసతి, మార్నింగ్ టీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. అలాగే, ప్రయాణికులకు ఇన్సురెన్స్ సైతం కవర్ అవుతుంది. ఎకానమీ క్లాస్వారికి నాన్ ఏసీ వసతి ఉంటుంది. ఇక స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరిలోని ప్రయాణికులకు ఏసీ హోటల్లో వసతి ఏర్పాటు చేస్తుండగా.. కంఫర్ట్ కేటగిరిలోని ప్రయాణికులకు మాత్రమే ఏసీ వాహనాల్లో ప్రయాణం కల్పిస్తారు. వివరాల కోసం ఐఆర్‌సీటీ టూరిజం వెబ్సైట్ irctctourism.com (ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే లింక్‌పై క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది) వెబ్సైట్లో సంప్రదించాలని కోరింది.