టెహ్రాన్: ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు.. ఇరాన్‌పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు మినాబ్‌లోని షాజరే తయ్యబే ఎలిమెంటరీ స్కూల్(Minab School)పై బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో సుమారు 156 మంది మృతిచెందారు. ఆ మృతుల్లో 120 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. దాంట్లో 73 మంది అబ్బాయిలు, 43 మంది బాలికలు ఉన్నారు. మిగితా వారిలో టీచర్లు, సిబ్బంది ఉన్నారు. అయితే ఆ దాడిలో మృతిచెందిన చిన్నారుల్లో ఒక్కరు మాత్రం ఇంకా మిస్సింగ్‌లోనే ఉన్నారు.
ఏడేళ్ల మకన్ నాసిరి అనే అబ్బాయి ఆచూకీ చిక్కలేదు. ఆ చిన్నారి మృతదేహాన్ని అధికారులు గుర్తించలేకపోయారు. కానీ ఆ పిల్లోడికి చెందిన ఓ కాలి షూ మాత్రం దొరికింది. సుమారు ఏడు వారాల పాటు ఆ పిల్లోడి ఆనవాళ్ల కోసం సెర్చింగ్ చేశారు. కానీ మకన్ ఆచూకీ చిక్కకపోవడంతో కేసును మూసివేస్తున్నట్లు ఇరానీ అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన రోజున 11 గంటల సమయంలో ఆ పిల్లోడి తల్లికి ఓ టీచర్ ఫోన్ చేసింది. స్కూల్‌పై దాడి జరిగిందని, త్వరగా వచ్చి పిల్లవాడిని తీసుకెళ్లమని చెప్పారు.
అయితే మకన్ తల్లి ఆ స్కూల్‌కు వెళ్లేలోపే అక్కడ విధ్వంసం చోటుచేసుకున్నది. దాడితో స్కూల్ మొత్తం చెల్లాచెదురైంది. శిథిలాలే మిగిలి ఉన్నాయి. స్కూల్ బస్సు డ్రైవర్ ప్రయత్నించినా పిల్లోడి ఆచూకీ చిక్కలేదు. ఇక ఆ ప్రాంతంపై రెండో మిస్సైల్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ రెస్క్యూ మరింత జఠిలమైంది. స్కూల్ దాడిలో చనిపోయిన చిన్నారులకు చెందిన అవశేషాలను ఫోరెన్సిక్ నిపుణులు ఐడెంటిఫై చేశారు. కానీ మకన్ ఆనవాళ్లను మాత్రం ట్రేస్ చేయలేకపోయారు.
డీఎన్ఏ టెస్టింగ్ తర్వాత కూడా ఆ పిల్లవాడి మృతదేహాన్ని గుర్తించలేదు. యుద్ధంలో మృతిచెందిన వారిలో 40 శాతం మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉందని ఇరాన్ ఫోరెన్సిక్ నిపుణుడొకరు తెలిపారు. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడిలో ఇప్పటి వరకు ఇరాన్లో 3375 మంది మరణించారు. మినాబ్పై జరిగిన దాడిలో అమెరికా తోమాహాక్ క్షిపణి వాడినట్లు అనుమానిస్తున్నారు.