Iran vs US : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జారీచేసిన ఆర్థిక హెచ్చరికలపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించింది. అమెరికా చర్యలు ఆ దేశ పతనానికే దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌పై ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఆ దేశ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఇరాన్ అధికారులు ఆరోపించారు.
భారీగా పెరిగిన అప్పులు, వడ్డీల భారం వంటి సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. అమెరికా సాగిస్తున్న ‘ఆర్థిక ఉగ్రవాదం’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, వివిధ దేశాల సార్వభౌమాధికారానికి పెను ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు.
అమెరికా అప్పులు సుమారు 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని గుర్తుచేస్తూ.. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఆ దేశ రుణభారాన్ని మరింత పెంచుతాయని విమర్శించారు. ఇరాన్‌కు సహకరించే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇరాన్‌ను ఒంటరిని చేసి ఓడించేందుకు మిత్రదేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను సమకూర్చుకోకూడదని అన్నారు. అయితే ఇటువంటి విఫల విధానాలవల్ల అమెరికాకు మరిన్ని పరాజయాలు తప్పవని ఇరాన్ దీటుగా జవాబిచ్చింది.