న్యూఢిల్లీ: రెండు కొత్త జట్ల చేరికతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13వ తేదీల్లో వేలం జరుగనుండగా..పాత ఎనిమిది జట్లతో పాటు కొత్తగా వచ్చిన రెండు జట్లు ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1214 మంది ఆటగాళ్లు వేలం కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో నుంచి 590 మందిని బీసీసీఐ ఫైనల్ చేసింది. ఇందులో 228 మంది క్యాప్డ్, 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాలకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసుకున్న డేవిడ్ వార్నర్‌తో పాటు గత వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, కగిసో రబడ, కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కోసం తీవ్ర పోటీ ఉండనుంది.
గేల్, స్టోక్స్ దూరం
ఐపీఎల్లో ఎన్నో అద్వితీయ ఇన్నింగ్స్‌లు ఆడి తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ కూడా తన పేరు నమోదు చేసుకోలేదు.
2022 టాప్ డ్రా
వేలంలోని స్టార్ ఆటగాళ్లు శిఖర్ ధవన్ మహమ్మద్ షమీ ఫాఫ్ డుప్లెసిస్ డేవిడ్ వార్నర్ ప్యాట్ కమ్మిన్స్ శ్రేయాస్ అయ్యర్ రవిచంద్రన్ అశ్విన్ క్వింటన్ డీకాక్
కగిసో రబాడ ట్రెంట్ బౌల్ట్