IPL 2026 | ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ సండే మ్యాచ్‌లు పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేశాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. ఆదివారం జరిగిన రెండు కీలక మ్యాచ్‌లు పాయింట్ల పట్టికపై భారీ ప్రభావం చూపించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి ఐదో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో లక్నో సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ చివరి బంతికి ముంబై ఇండియన్స్‌పై గెలిచి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయింది. ప్రస్తుతం ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి +1.103 నెట్ రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ +0.737 నెట్ రన్‌రేట్ కారణంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, మొన్నటి వరకు టాప్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు వరుస విజయాలతో మళ్లీ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించిన చెన్నై ఐదో స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో ఉన్నప్పటికీ తక్కువ నెట్ రన్‌రేట్ కారణంగా ఆరో స్థానానికి పడిపోయింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో తమ చివరి అవకాశాలను కూడా కోల్పోయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సారి టాప్ 4లో ఏయే జట్లు నిలుస్తాయి, ఎవరు ట్రోఫీ అందుకుంటారు అనే దానిపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.