మార్కెట్లోకి ఎన్ని స్మార్ట్ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. టెక్ ప్రియుల మనసును ఇట్టే దోచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే దిగ్గజ ఆపిల్ సంస్థ కూడా.. ఏటా ఓ సరికొత్త మోడల్‌ను పరిచయం చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఐఫోన్-18 మార్కెట్లోకి రానున్నది. ఈ క్రమంలో ఫీచర్లు, అందుకు సంబంధించిన లీక్‌లతో ‘ఐఫోన్-18’.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.
గత మోడల్స్‌తో పోలిస్తే.. మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో ఐఫోన్ 18 మోడల్స్ రానున్నాయి. ముఖ్యంగా.. ఐఫోన్ 18 ప్రొ, 18 ప్రొ మ్యాక్స్‌లో పలు ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఐఫోన్-18 ప్రొ సిరీస్‌లో అతిపెద్ద మార్పు.. ఇందులోని మెయిన్ కెమెరా. 48 మెగా పిక్సెల్ కెమెరా.. వేరియబుల్ అపెర్చర్‌తో వస్తున్నది. ఈ సదుపాయం వల్ల లైటింగ్ పరిస్థితులను బట్టి లెన్స్ ఎంతకాంతిని తీసుకోవాలో ఆటోమేటిక్‌గా, మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డీఎస్ఎల్ఆర్ కెమెరాల మాదిరిగానే తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి 2-నానోమీటర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందుతున్న ఏ20 ప్రొ ప్రాసెసర్‌ను ఇందులో పొందుపర్చారు.
పాత చిప్‌లతో పోలిస్తే ఇది 15% వేగవంతమైన పర్ఫార్మెన్స్, 30% మెరుగైన పవర్ ఎఫిషియన్సీని ఇస్తుంది. దీనివల్ల గేమింగ్, హెవీ టాస్క్‌లతోపాటు కొత్త ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్లు మరింత వేగంగా పనిచేస్తాయి. ఇక డిజైన్, డిస్ప్లేలోనూ ఆపిల్ కొన్ని మార్పులు చేస్తున్నది. స్క్రీన్‌పై ఉండే డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని దాదాపు 35% తగ్గించనున్నది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సర్లను స్క్రీన్ కింద అమర్చడం ద్వారా.. ఇది సాధ్యం కానుంది. డిస్ప్లే పరిమాణం విషయానికి వస్తే.. ప్రొ మోడల్ 6.3 అంగుళాలు, ప్రొ మ్యాక్స్ 6.9 అంగుళాల స్క్రీన్‌తో రానున్నాయి. ఈసారి మరింత బ్రైట్నెస్, తక్కువ బ్యాటరీ వినియోగించే ఎల్టీపీవో+ ఓఎల్ఈడీ ప్యానెల్స్ వాడుతున్నారు. అంతేకాకుండా, కొత్త మోడల్స్‌లో బ్యాటరీ సామర్థ్యాన్నీ పెంచింది. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రొ మ్యాక్స్ మోడల్ 5,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రానున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి.
కనెక్టివిటీ, ర్యామ్ విషయాకి వస్తే.. 18 సిరీస్‌లో బేస్ మోడల్స్ నుంచి ప్రొ మోడల్స్ వరకు అన్నిటికీ 12 జీబీ ర్యామ్‌ను స్టాండర్డ్‌గా ఇవ్వనున్నారు. యాపిల్ సొంతంగా తయారుచేసిన సీ2 మోడెమ్ ఇందులో రానుంది. ఇది సాధారణ మొబైల్ నెట్వర్క్ లేనప్పుడు కూడా శాటిలైట్ ద్వారా నేరుగా 5జీ ఇంటర్నెట్/కనెక్టివిటీని పొందేలా సహాయపడుతుంది. ఈసారి ప్రత్యేకంగా ‘డార్క్ చెర్రీ’ పేరుతో డీప్ రెడ్/ పర్పుల్ షేడ్ కలర్‌ను ఆపిల్ పరిచయం చేయనుంది.