ఉస్మానియా యూనివర్సిటీ: దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (పాత ఏఎంఎస్)లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డీడీఎంఎస్ ఒకేషనల్ కోర్స్ సెంటర్లో ఫార్మసీ అసిస్టెంట్ (మూడు నెలలు), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ (ఆరు నెలలు), హెల్త్‌కేర్ మల్టీ పర్పస్ వర్కర్ (ఒక సంవత్సరం) తదితర కోర్సులను అందిస్తున్నట్లు చెప్పారు. కనీసం పదవ తరగతి పాసైన అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని వివరించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9397824542 నెంబర్లో సంప్రదించాలన్నారు.
29న రేడియోలాజికల్ ఫిజిక్స్ ప్రవేశ పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్ష ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తమ కార్యాలయ ఆవరణలోనే ప్రారంభమవుతుందని, పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను గంట ముందు పరీక్షా కేంద్రంలోనే తీసుకోవాలని సూచించారు.